![భూ కుంభకోణం... 102 ఎకరాలు హోల్డ్.. తహశీల్దార్ సస్పెన్షన్](https://static.v6velugu.com/uploads/2025/02/illegal-land-registration-bhupalapalli-district-palivela-mandal-area_kAeVfaQSjG.jpg)
- భూపాలపల్లి జిల్లా పలిమెలలోని భూమిని డెక్కన్ సిమెంట్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్
- ఫీల్డ్ విజిట్ చేయకుండానే పట్టాలు ఇచ్చినట్లు గుర్తింపు
- భూములను హోల్డ్ లో పెట్టిన సర్కార్, తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
జయశంకర్ భూపాలపల్లి (పలిమెల), వెలుగు : భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన 102 ఎకరాల భూమిని ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. దీంతో పాటు ఫీల్డ్ విజిట్ చేయకుండా డెక్కన్ సిమెంట్స్ పేరిట పట్టాలిచ్చిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
డెక్కన్ సిమెంట్స్ పేరిట పట్టాలు ఇచ్చిన తహసీల్దార్
పలిమెల రెవెన్యూ పరిధిలోని 102 ఎకరాల వ్యవసాయ భూమిని పలిమెల తహసీల్దార్ సయ్యద్ సర్వర్ గతేడాది డిసెంబర్ 11న డెక్కన్ సిమెంట్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం పట్టా కాలమ్‌లో ఉన్న పేర్ల ఆధారంగా ఈ మార్పులు చేశారు. దీంతో ఒకే రోజు వందకుపైగా ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, మ్యుటేషన్ చేయడం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
తమ ఆధీనంలో ఉన్న భూములు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ పేరున మారిన విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు. నాన్ లోకల్‌కు చెందిన 13 మంది పట్టాదారులు, తహసీల్దార్ కలిసి పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకొని తమకు అన్యాయం చేశారని కలెక్టర్, సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు.
కాస్తు కాలమ్‌లో రైతుల పేర్లు ఉన్నట్లు గుర్తింపు
రైతుల ఫిర్యాదుతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఫీల్డ్ ఎంక్వైరీ చేపట్టడంతో పాటు పాత రికార్డులను సైతం పరిశీలించారు. రికార్డుల్లోని కాస్తు కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన రైతుల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. బీఆర్‌ఎస్ హయాంలో రెవెన్యూ రికార్డుల నుంచి కాస్తు కాలమ్ తొలగించడం వల్లే ఈ మార్పిడి జరిగినట్లు నిర్ధారించారు. 2014–15లో రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా పట్టా కాలమ్‌లో ఉన్న నాన్ లోకల్స్ పేరిట ధరణి పాస్ బుక్స్ మంజూరు చేసినట్లు తెలుసుకున్నారు.
ఆ పాస్ బుక్స్ ఆధారంగానే తహసీల్దార్ సయ్యద్ సర్వర్ డెక్కన్ సిమెంట్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఒకేసారి వంద ఎకరాలకు పైగా భూములను ఒకే కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో, తహసీల్దార్ నిర్ణయం వెనుక కుట్ర కోణం దాగి ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
దీంతో సర్కార్ ఆదేశాల మేరకు పలిమెల తహసీల్దార్ సయ్యద్ సర్వర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు 102 ఎకరాల భూములను హోల్డ్‌లో పెడుతూ సీసీఎల్‌ఏ ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. పలిమెల డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.