- మైనింగ్..మా జాగీరు!
- జోరుగా మానుకోట జిల్లాలో అక్రమ మైనింగ్, బంక మట్టి తవ్వకాలు
- ఫైన్లతోనే సరిపెడ్తున్న విజిలెన్స్, మైనింగ్ ఆఫీసర్లు
- ఏండ్లు గడిచినా చర్యలు తీసుకోరు..
- ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి
- అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యం
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్భూముల్లో జోరుగా అక్రమ మైనింగ్, బంకమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గిరిజనులకు నామమాత్రంగా డబ్బులు చెల్లిస్తూ వారి భూముల నుంచి కోట్ల విలువైన ఖనిజ సంపదను గిరిజనేతరులు తవ్వుకపోతున్నారు. విజిలెన్స్, మైనింగ్ ఆఫీసర్లు భారీగా ఫైన్లు వేసినా దందాలు ఆగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇదంతా నడుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి చిన్న మొత్తం ఫైన్లు కూడా వదలకుండా కట్టించుకునే ఆఫీసర్లు.. బడాబాబులు మైనింగ్ దందా పేరిట కోట్ల విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతున్న చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులు జప్తు చేసే పవర్ ఉన్నా యాక్షన్ తీసుకోవడం లేదు.
జోరుగా అక్రమ మైనింగ్..
జిల్లాలో ప్రభుత్వ పర్మిషన్ పొందిన సర్వే నెంబర్లలో కాకుండా ప్రభుత్వ, ఫారెస్ట్, చెరువు శిఖం భూముల్లోనూ మైనింగ్చేస్తున్నారు. చిన్న సైజ్‌లో గ్రానైట్ రాళ్లను కటింగ్ కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. రాత్రిపూట వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడ్తున్నారు. అలాగే బయ్యారం, మానుకోట , తొర్రూరు, మరిపెడ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ఎక్కువగా ఉండడంతో మైనింగ్, ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా, సీనరేజ్ ట్యాక్స్ చెల్లించకుండా చెరువుల్లో నుంచి లారీల కొద్దీ బంకమట్టి తవ్వకాలను చేపడ్తున్నారు.
కంఠాయపాలెం పెద్ద చెరువు చెర..
జిల్లాలోని తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ పెద్ద చెరువు శివారులో భారీగా బ్లాక్ గ్రానైట్నిక్షేపాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ ఎంపీ అండదండలతో ఎఫ్టీఎల్ హద్దులు దాటి చెరువు ప్రాంతంలోని నీటిలో తోడిన మట్టిని పోసి ప్రభుత్వ సర్వే నెంబర్ పరిధిలోనూ అక్రమ గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా చేపడ్తున్నారు. గ్రానైట్ తరలింపు కోసం చెరువు శిఖంలో రోడ్డు పోశారు. జిల్లా ఆఫీసర్లకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
పర్మిషన్ పొందిన క్వారీలు..
జిల్లాలో మొత్తం 197 చోట్ల క్వారీలకు పర్మిషన్లు ఉన్నాయి. అవి డోలమైట్-4, బైరటీస్ -3, క్వార్ట్జ్-1, బ్లాక్ గ్రానైట్ -168, కలర్ గ్రానైట్ -2, మెటల్ (స్టోన్) -19. వీటి నుంచి ప్రభుత్వానికి సీనరేజ్ ట్యాక్స్ ద్వారా 2021–22లో రూ. 1,743.18 లక్షల ఆదాయం వచ్చింది. 2022–23 లో 3,509.6 లక్షలు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
ఫైన్లంటే డోంట్‌కేర్..
జిల్లాలో విజిలెన్స్ ఆఫీసర్లు 2019–20లో అక్రమ మైనింగ్ చేసిన వారికి విధించిన ఫైన్ల వివరాలిలా ఉన్నాయి.. బయ్యారం మండలం లింగగిరిలో సర్వే నంబర్188లో అక్రమ మైనింగ్ నిర్వహించినందుకు చింత వెంకటేశ్వర్లుకు రూ. 6,24,525, కాంచనపల్లిలో సర్వే నెం.224లో చెరుప రోజాకు రూ.1,87,950, ధర్మాపురంలో సర్వే నెం.447లో తురుసం వెంకయ్యకు రూ.3,62,835, ధర్మారంలో సర్వే నెం.426లో గొగ్గల బక్కయ్యకు రూ.12,19,170, ధర్మారంలో సర్వే నెం.414లో వరుస రాములమ్మకు రూ.3,43,980, ధర్మారంలో సర్వే నెం.409లో చెరుప చుక్కమ్మకు రూ.6,14, 196, లింగగిరిలో సర్వే నెం.225 లో పూనెం మంగయ్యకు రూ.5,26,471, ధర్మారంలో సర్వే నెం.431లో డి.ఐలయ్యకు రూ.10,45,380, లింగగిరిలో సర్వే నెం.238లో ఎండీ అఫ్జల్‌కు రూ.8,67,086 , మహబూబాబాద్ మండలం శనిగపురంలో సర్వే నెం.266లో మణికంఠ స్టోన్ క్రషర్ ఓనర్‌కు రూ.13,35, 602 ఫైన్లు విధించారు. అలాగే 2020–21లో ఇనుగుర్తి మండల కేంద్రంలోని సర్వే నెం.194/1లో ఆర్.మహేందర్ రావు అక్రమ మైనింగ్ చేసినందుకు రూ. 5,75, 000 ఫైన్ వేశారు. వీటిలో స్టోన్ క్రషర్ యజమానులతో పాటు పలువురు సామాన్య భూ యజమాలు ఉన్నారు. జిల్లాలో మొత్తంగా ఫైన్ల రూపేణా సర్కార్‌కు రూ.77,02,195 రావాల్సి ఉంది.
మైనింగ్ ఫైన్లు ఇలా..
2019–20లో బయ్యారం మండలం కాంచనపల్లిలో సర్వే నెం.233/1 అక్రమ మైనింగ్చేసినందుకు చింత వెంకటేశ్వర్లుకు రూ.2,24,370, ధర్మాపురంలోని సర్వే నెం.618లో గుమ్మనపెల్లి చిన్ననర్సయ్యకు రూ.2,95,110, కాంచనపల్లిలో సర్వే నెం.225 లో పర్సిక ఎర్రయ్యకు రూ.58, 932, లింగగిరిలో సర్వే నెం.239/1 లో ఎ.గోవర్ధన్‌కు రూ.83, 502, లింగగిరిలో సర్వే నెం.223/1 లో వెల్లంకి శ్రీనివాస్ కు రూ.7,73,952, గార్ల మండలం మద్దివంచ గ్రామంలో 119/పీ సర్వే నంబర్లో అక్రమ మైనింగ్ చేసినందుకు ఎస్. రామకృష్ణకు రూ.5,91,10,281 ఫైన్ విధించారు. 2022–23లో మహబూబాబాద్ మండలం బేతోల్లో సర్వే నెం. 132లో మాచర్ల ఉప్పలయ్యకు రూ.96,89,900, మార్నేని కిరణ్ కుమార్‌కు సర్వే నెం,56లో అక్రమ మైనింగ్‌కు రూ.49,89,600 ఫైన్ వేశారు. మొత్తంగా మైనింగ్‌శాఖకు రూ. 7,52,25, 647 ఫైన్ వసూలు కావాల్సి ఉంది.
ఫైన్లు కట్టకుంటే రికవరీ యాక్ట్
జిల్లాలో అక్రమంగా మైనింగ్, బంక మట్టి తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెట్టడంతో పాటు, భారీగా ఫైన్లు కూడా వేస్తున్నాం. వీరంతా ప్రభుత్వ ఖజానాకు ఫైన్ విలువను జమ చేయాలి. లేకుంటే ప్రభుత్వ అనుమతితో వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తాం.
-
రవీందర్ , మైనింగ్ఇన్ చార్జ్ ఏడీ, మహబూబాబాద్జిల్లా