
- గ్యాంగులను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు
- బియ్యం, వడ్లు సేకరించి లారీల్లో రవాణా
మహబూబ్‌నగర్, వెలుగు: తెలంగాణ వడ్లు, పీడీఎస్ బియ్యాన్ని కర్నాటకకు చెందిన వ్యాపారులు తరలించుకుపోతున్నారు. అక్కడ వీటికి డిమాండ్ ఉండడంతో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకుంది. వారి ద్వారా పెద్ద మొత్తంలో రైతుల నుంచి వడ్లు, పేదల నుంచి పీడీఎస్ బియ్యం సేకరించి లారీల్లో కర్నాటకకు తరలిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి తెలంగాణ–-కర్నాటక బార్డర్‌లోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని టై రోడ్డు వద్ద ఉన్న చెక్‌పోస్ట్ దగ్గర ఎన్స్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు ముందస్తు సమాచారంతో ఆరు లారీల వడ్లు, ఒక లారీ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
గ్యాంగుల ద్వారా సేకరణ..
వడ్లు, పీడీఎస్ బియ్యం సేకరించేందుకు కర్నాటకకు చెందిన వ్యాపారులు కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పలుకుబడి ఉన్న పొలిటికల్ లీడర్లతో చేతులు కలుపుతున్నారు. పొలిటికల్ లీడర్లకు నమ్మకస్తులుగా ఉన్న వారిని కలుపుకొని గ్యాంగ్‌గా ఏర్పాటు చేస్తున్నారు. వీరి ద్వారా గ్రామాల్లో రైతులు, రేషన్ లబ్ధిదారులను కలుస్తున్నారు. వారికి కొంత డబ్బు ముట్టజెప్పి.. స్టాక్‌ను ట్రాలీ ఆటోల్లో లోడ్ చేసుకొని.. తెలిసిన వారి పొలాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రిళ్లు ఆ డంపులను డీసీఎంలు, లారీల్లో ఎక్కించి కర్నాటకకు తరలిస్తున్నారు.
దీనిపై కొంత కాలంగా స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్లు పోతున్నాయి. ఈ క్రమంలో వారు తెలంగాణ, -కర్నాటక, ఏపీ బార్డర్ల వద్ద నిఘా పెంచారు. సోమవారం రాత్రి ఈ జిల్లాల నుంచి సేకరించిన వడ్లు, పీడీఎస్ బియ్యాన్ని ఏడు లారీల్లోకి ఎక్కించి నారాయణపేట జిల్లా మీదుగా బార్డర్ దాటిస్తుండగా.. ముందస్తు సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఈ లారీల్లో 3,500 బస్తాల వడ్లు ఉన్నాయి. ఈ బస్తాలన్నీ 40 కిలోల చొప్పున ఉన్నాయి. అయితే బ్యాగులు ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మచ్చుకు మరికొన్ని ఘటనలు..
- మహబూబ్‌నగర్‌లోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో కొద్ది రోజుల కింద సివిల్ సప్లైకు చెందిన రూ.2.50 కోట్లు విలువ చేసే బియ్యం మాయమయ్యాయి. సివిల్ సప్లై ఆఫీసర్లు ఈ గోదాములో తనిఖీలుచేయగా, 680 మెట్రిక్ టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ డిపార్ట్మెంట్ కమిషనర్‌కు కంప్లైంట్ చేశారు. కానీ, పాలమూరుకు చెందిన ఓ పొలిటికల్ లీడర్ జోక్యం చేసుకొని అక్రమార్కులను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులో కొద్ది రోజుల కింద లారీ, డీసీఎంలో తరలిస్తున్న 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నా.. తక్కువ మొత్తం చూపించారనే ఆరోపణలు వచ్చాయి.
- గత నెల నారాయణపేటలో అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చుట్టుపక్కల ఇండ్ల నుంచి రేషన్ బియ్యం సేకరించి సుభాష్‌రోడ్ లోని ఓ రేకుల షెడ్డులో నిల్వ చేస్తుండగా, టాస్క్ ఫోర్స్, నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీలేరు గ్రామంలో గత నెల నలుగురు ఇండ్లల్లో సోదాలు చేసి 42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని కేసులు నమోదు చేశారు. గండీడ్, మహ్మదాబాద్, ఊట్కూరు మండలం సమిస్తాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆఫీసర్లు దాడులు చేసి పట్టుకున్నారు.