కరీంనగర్, వెలుగు: అది తారు రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి.. హైవేకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎకరం విలువ రూ.2.5 కోట్ల పైమాటే. రూ.50 కోట్ల విలువైన భూమికి రెవెన్యూ ఆఫీసర్లు తమకు నచ్చినవాళ్ల పేరు మీద పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేశారు. అసైన్‌మెంట్ కమిటీతో సం బంధం లేకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండానే కొందరు లీడర్లతో కుమ్మక్కై ఆఫీసర్లు నడిపిన ఈ వ్యవహారం కరీంనగర్ రూరల్ మండలం నగునూ రులో వెలుగుచూసింది. ప్రభుత్వం అసైన్ చేయకుండానే 18 మంది పేరిట 22 ఎకరాల భూమికి పాస్ బుక్స్ మంజూరు చేయడం, మరోవైపు అసైన్ మైంట్ ఒరిజనల్ ఫైల్ మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాన్‌లోకల్స్ పేరిట ధరణిలో నమోదు
కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని 669 సర్వే నంబర్ లో 26.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కరీంనగర్ లక్సెట్టిపేట హైవేకు కిలో మీటరున్నర దూరంలో తారు రోడ్డుకు రెండు వైపులా ఈ భూమి విస్తరించి ఉంది. రోడ్డు పక్కనే ఉండడంతో కొందరి కన్ను ఈ భూమిపై పడింది. రెవెన్యూ అధికారుల సాయం వారికి తోడైంది. దీం తో ప్రభుత్వం అసైన్ చేయకపోయినా ఈ సర్వే నంబర్‌లోని 22 ఎకరాలను 18 మంది పేరిట నమో దు చేశారు. అందరికీ పట్టాదారు పాస్ బుక్స్ జారీ అయ్యాయి. వారిలో ఇద్దరే స్థానికులు ఉండగా.. మిగతా వారంతా స్థానికేతరులని తెలిసింది.
ఓ ప్రజాప్రతినిధికీ పట్టా..
నగునూరు గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి 4.045 ఎకరాల వ్యవసాయ పట్టా భూమి ఉన్నట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి. సొంత పట్టా భూమి ఉండగానే 669లో ఓ బై సర్వే నంబర్ లోని ఎకరం ప్రభుత్వ భూమిని ఆయన పేరిట రెవెన్యూ ఆఫీసర్లు నమోదు చేశారు. నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్ లో ఈ ఎకరం భూమిని ప్రభుత్వ భూమి అనో అసైన్డ్/లావణీ పట్టా అనో పేర్కొనాల్సి ఉం డగా పట్టా భూమి అని రాశారు. వాస్తవానికి ఎలాంటి భూమి లేని నిరుపేదలకు మాత్రమే అసై న్డ్ భూమిని పొందే చాన్స్ ఉంది. కానీ 4.045 ఎకరాల పట్టా భూమి ఉన్న ఆయన మళ్లీ ఎకరం అసైన్డ్ భూమిని పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని అమ్మడానికి వీల్లేకుండా ధరణిలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో పెట్టడంతో.. సదరు వ్యక్తి అందులో నుంచి డిలీట్ చేసేందుకు కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్న ఈ అప్లికేషన్ను అప్రూవ్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 20 గుంటల చొప్పున నలుగురికి రాసిచ్చిన 2ఎకరాలను కూడా పట్టా భూములుగానే రికార్డు చేశారు.
ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ పేరిట 2 ఎకరాల వ్యవసాయ పట్టా భూమి ఉండగా.. ఆమె పేరిట 15 గుంటల ప్రభుత్వ భూమిని నమోదు చేశారు. వేర్వేరు సర్వే నంబర్లలో 2.14 ఎకరాల భూమి కలిగి ఉన్న మరో వ్యక్తికి.. తన ల్యాండ్ కు ఆనుకుని ఉన్న 15 గుంటల సర్కార్ ల్యాండ్ ను రాసిచ్చారు.
‘ఇతరులు ధరణి’ పేరిట 11 ఎకరాలు
నగునూరులో 669/1తోపాటు మరో ఐదు సర్వే నంబర్లలో 11.0300 ఎకరాల భూమి ‘ఇతరులు ధరణి’ పేరిట ధరణిలో నమోదైంది. పట్టాదారు పేరు ‘ఇతరులు ధరణి’, తండ్రి పేరు ఇతరులు, జండర్ పురుషుడు, క్యాస్ట్ కేటగిరీ జనరల్ గా నమోదు చేశారు. 201-2లో 34 గుంటలు, 638/బీ/3లో 0.0100 ఎకరాలు, 669/1లో 1.0900 ఎకరాలు, 726/1లో 4.3100 ఎకరాలు, 72 8/1లో 3.18 ఎకరాలు, 1143/ఈ/2లో 30 గుంటల వ్యవసాయ భూమి ఇతరుల పేరిట నమోదై ఉంది.
ఒరిజినల్ ఫైల్ లేదట
669 సర్వే నంబర్‌లో ఐదుగురికి మూడెకరాల చొప్పున ప్రభుత్వ భూమిని పట్టా చేశారు. వారిలో నలువాల రాములు, కె.రాజయ్య, డి.అంజయ్య, జి.రంగయ్య, కొండూరి వినోద్ కుమార్ ఉన్నారు. సమాచార హక్కు చట్టం కింద కొత్తకొండ శ్రీనివాస్ అనే వ్యక్తికి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ 2020 ఫిబ్రవరి 11న ఇచ్చిన సమాచారం ప్రకారం నలువాల రాములు మినహా మిగతా నలుగురి పేర్లు అసైన్డ్ లబ్ధిదారుల జాబితాలో లేవు. ఈ సర్వే నంబర్ లో జరిగిన అసైన్ మెంట్ ఫైల్ కరీంనగర్ రూరల్ మండలం ఏర్పాటయ్యాక తమకు అందలేదని, ఉమ్మడి కరీంనగర్ మండలం రికార్డుల్లోనూ దొరకలేదని, ప్రస్తుతం ఒరిజనల్ ఫైల్ లభించనందున సర్వే నంబర్ 669లో ఎంత మందికి అసైన్ మెంట్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారో సమాచారం లేదని ఆర్టీఐ రిప్లైలో తహసీల్దార్ పేర్కొన్నారు.
భూమిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలి
నగునూరులోని 669 సర్వే నంబర్ లో ఉన్న 26.08 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు.. లీడర్లు, వ్యాపారులు, ఉద్యోగులకు కట్టబెట్టారు. వీళ్లలో ప్రభుత్వ భూమిని పొందడానికి ఎవరూ అర్హులు కాదు. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, అసైన్డ్ కమిటీ ఆమోదం లేకుండా.. అసలు ఎలాంటి ప్రొసీజర్ లేకుండా అప్పటి తహసీల్దార్ ధరణిలో రికార్డు చేసి అనర్హులకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు రద్దు చేసి, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు పంపిణీ చేయాలి.
కొత్తపల్లి అమర్ నాథ్, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ అంబేద్కర్ సంఘం