నిజామాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలోని కుంటకింది సంఘం, గడ్డం సంఘం, బొమ్మ సంఘం, ఈర్ల ముదిరాజ్ సంఘంలో సభ్యులైన సుమారు 300 మందిని వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) వారు సంఘ బహిష్కరణ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆ సంఘ సభ్యులు లింబాద్రి, రుక్మిణి మాట్లాడుతూ.. గ్రామంలోని కప్పల వాగు నుంచి సంగేమ్ కిషన్ అనే వ్యక్తి ఇసుకను అక్రమంగా భారీ వెహికల్స్‌తో తరలిస్తున్నాడన్నారు. రాత్రివేళ పొలం, తోటల వద్దకు వెళ్లి వచ్చేవారికి ఈ వెహికల్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
అలాగే కాలనీ వాసులకు నిద్ర కరువైందన్నారు. తమ గల్లీలో నుంచి ఇసుకను తరలించవద్దని వీడీసీ వారిని కోరితే తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు. తమకు ఊళ్లో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా, కిరాణాషాపుల్లో నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోకుండా చేశారన్నారు. ఎవరైనా తమతో మాట్లాడినా, బైకుల పైన వెళ్లినా లక్ష జరిమానా విధిస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు, పోలీసులకు, లీడర్లకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పందేన తిరుపతి, జాగర్ల గంగాధర్, గడ్డం శ్రీనివాస్, జాగర్ల నర్సయ్య, జాగర్ల గణేష్, పొన్నాల చిన్నయ్య, గడ్డం రాజమణి, జంగడి గంగా నర్సు, మర్రి కవిత తదితరులు పాల్గొన్నారు.