ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలోని పెన్ గంగా, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. రోజుకు 500లకు పైగా ట్రిప్పులను తరలిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. పెన్ గంగా పరివాహక ప్రాంతం తాంసి నుంచి, బేల మండలం వరకు ఈ దందా నడుస్తోంది. ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు.
వీడీసీల ఆధ్వర్యంలో..
ఇసుక రవాణకు తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో వీడీసీలు టెండర్లు వేస్తున్నారు. ఏరియాను బట్టి వ్యాపారులు రూ. 10 లక్షల నుంచి రూ. 35 లక్షల చెల్లిస్తున్నారు. డోలార, సాంగ్వి, పెండల్వాడ, సాంగిడి, తాంసికే , వడూర్, గుబిడి, గోముత్రి, గొల్లగడ్ ప్రాంతాల నుంచి ఇసుక ఎక్కువ తరలిపోతోంది.
అధికార పార్టీ అండతో!
గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో దందా నడుస్తోందనే ఆరోపణులు ఉన్నాయి. ఆఫీసర్లు నామ మాత్రపు దాడు చేసి మమ అనిపిస్తున్నారు. జిల్లాలో ఇసుక లభ్యతపై అధికారులు గతంలో సర్వే చేశారు. ఈ ప్రాంతంలో ఇసుల లేదని తేల్చారు. దీంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని దీంతో మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు. కానీ, గ్రామాల్లో మాత్రం ఇసుక దందా ఆగడం లేదు. కొన్ని గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లను గ్రామాస్థులు అడ్డుకుంటున్నారు. అలాంటి సమయంలో పట్టుబడ్డ టాక్టర్లపై అధికారులు కేసులు పెడుతున్నారు తప్పా.. తవ్వకాలను అడ్డుకోవడం లేదు. కొంత మంది వ్యాపారులు అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇసుక దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రోజూ వందల ట్రాక్టర్లు..
పెన్ గంగా నది తో పాటు వాగుల్లోంచి రోజూ దాదాపు 500 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలిపోతోంది. లేబర్లతో పాటు జేసీబీలతో సైతం తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పెన్ గంగ, వాగులు ఖాళీ అవుతున్నాయి. ఆ ఇసుకను అక్రమంగా ఒక్కో ట్రిప్పుకు రూ. 3500 దాకా అమ్ముతున్నారు. ఇటు నేరుగా వినియోగదారులకు ఇసుక అమ్మడంతో పాటు పెన్ గంగా పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఎక్కువగా డంప్ చేస్తున్నారు. వీటిని మరింత ఎక్కువ ధరలకు అమ్మేందుకు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా అమ్మితే రావాల్సిన ఆదాయానికి ఈ అక్రమ రవాణతో భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎలాంటి అనుమతులు లేవు
జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. ఇప్పటి వరకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని వంద కేసులు నమోదు చేశాం. ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నాం.
- రవి శంకర్, మైనింగ్ ఏడీ