ఫ్రీ ఇసుక దోచేస్తున్నరు.. స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దందా..

ఫ్రీ ఇసుక దోచేస్తున్నరు.. స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దందా..
  • వాగుల నుంచి రోజూ వందల ట్రాక్టర్లు, లారీలతో రవాణా
  • ‘స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుక’ అంటూ నిరుడు సర్కార్ సర్క్యులర్​
  • ఇదే అదునుగా లోకల్​ లీడర్లు, కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ
  • ఇష్టారీతిగా చెరువులు, వాగుల నుంచి ఇసుక తరలింపు
  • ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న స్టాక్‌‌ పాయింట్లు
  • ఫ్రీ ఇసుక కోసం స్థానికులు అటుగా వెళ్తే దాడులు
  • లేబర్​ చార్జీలు, ఆఫీసర్లకు మూమూళ్ల పేరిట వసూళ్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: ఇసుక పాలసీ అంతా లోకల్‌‌ లీడర్ల చేతుల్లో నడుస్తున్నది. స్థానికులకు ఫ్రీగా ఇసుక ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకొని చెరువులు, వాగుల నుంచి అందినకాడికి తోడేస్తున్నారు. మార్కెట్​లో పెట్టి, ఇష్టారీతిగా రేట్లు పెంచి జేబులు నింపుకుంటున్నారు. ఫ్రీ ఇసుక కోసం స్థానికులు ఎవరైనా అటుగా వెళ్తే.. బెదిరించడం, కక్ష సాధింపులకు దిగడం వంటి చర్యలకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు వాగులు ఉన్న చోట ఇబ్బడిముబ్బడిగా ఇసుక అక్రమ స్టాక్‌‌ పాయింట్లు వెలుస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో కార్తీక మాసం స్టార్ట్‌‌ కావడంతో ఊర్లలో కొత్త ఇండ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ముగ్గులు పోసుకొని పునాదులు తవ్వి కాంక్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో మార్కెట్​లో ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఫ్రీ ఇసుక సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగతి అటుంచితే.. కనీసం తగ్గింపు ధరలకు కూడా ఇసుక దొరకట్లేదని ప్రజలు అంటున్నారు.

అక్రమంగా స్టాక్​ పాయింట్లు పెట్టి..!
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రాంతంతో పాటు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగుల్లో లక్షల టన్నుల కొద్దీ ఇసుక నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం గోదావరి తీరం వెంట ‘సర్కారు ఇసుక స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్ల’ను ఏర్పాటు చేసి ఇసుక క్రయవిక్రయాలు జరుపుతున్నది. తెలంగాణ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌(టీజీ ఎండీసీ)‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి జిల్లాలో 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో 2, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో ఒకటి కలిపి మొత్తం 17 ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2024  మార్చి 23న ఉచిత ఇసుక స్కీం తీసుకొచ్చింది.

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు స్టేట్​ మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణాకు అనుమతిచ్చారు.

సర్కారు ఆదేశాలను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు తమకు అనుకూలంగా మార్చుకొని.. స్థానిక అవసరాలకు అంటూ అందినకాడికి ఫ్రీ ఇసుకను తోడుకుంటున్నారు. కొన్ని చెరువులు, వాగుల నుంచైతే రోజూ వందల కొద్దీ ట్రాక్టర్లతో ఇసుకను తరలించేస్తున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరకట్లేదు. ఒకవేళ ఎవరైనా స్థానికులు తమ ఇంటి నిర్మాణ పనులకు ఇసుక కావాలని వాగుల వద్దకు వెళ్తే.. వ్యాపారులు దబాయిస్తున్నారు. దాడులు చేయిస్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా, ములుగు జిల్లాల్లో అయితే  గోదావరి వెంట కూడా అక్రమ ఇసుక స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు పెట్టుకొని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దొడ్డురకం ఇసుక టన్నుకు రూ.1,000 నుంచి 1,200 ధర పలుకుతుంటే.. సన్న ఇసుక రేట్లు అయితే అమాంతం పెంచేశారు. టన్నుకు రూ.1,300 పైన ధర చెల్లిస్తే తప్ప దొరకడం లేదు. 

ఆఫీసర్లకు మామూళ్లు ఇస్తున్నామంటూ..!
లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగుల్లో ఇసుక తవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో స్థానిక నాయకులు ఇసుక వ్యాపారం నడిపిస్తున్నారు. గోదావరి నదికి దగ్గర్లో ఉన్న గ్రామాలు,  వాగుల వెంట ఉన్న కొందరు విలేజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలు వేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, లారీలలో ఇసుక నింపడానికి లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ఆయా మండలాల పరిధిలోని కొందరు రెవెన్యూ, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు నెల, నెల మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి.. సామాన్య జనం నుంచే ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో వాగుల నుంచి కూడా ఫ్రీ ఇసుక తీసుకోలేక జనం అవస్థలు పడుతున్నారు. లోకల్​ లీడర్లు చెప్పిన రేట్లకే ఇసుక కొనుక్కోవాల్సి వస్తున్నదని అంటున్నారు. 

ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక దొరికేనా?
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వ ఇసుక స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లపై దృష్టి సారించాలని ఆఫీసర్లకు తేల్చిచెప్పారు. సీఎం ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంత్రాంగం ఇసుక క్వారీలను పరిశీలించారు. ప్రస్తుతం గోదావరి వెంట రాష్ట్రవ్యాప్తంగా 17 ఇసుక క్వారీలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇవి గాక రాష్ట్రంలో అనఫిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వందల సంఖ్యలో ఇసుక స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఏర్పాటు చేసి ఇసుక అధిక ధరలకు అమ్మి జేబులు నింపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక లభ్యమయ్యేనా? అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది. ఫ్రీ ఇసుక ఇస్తే ఎలా సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు? మండలానికో స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి ఆఫీసర్ల ద్వారా ఇసుక సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారా? లేక లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు తీసుకొని ఇసుక అందిస్తారా? అనే విషయంపై ఆఫీసర్లు ఎవ్వరూ కూడా నోరు మెదపట్లేదు. ప్రస్తుతానికి అయితే సీఎం ఆదేశాల మేరకు సర్కారు ఇసుక స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించి నివేదికలు ప్రభుత్వానికి పంపించారు.

అక్రమ దందా చేస్తే చర్యలు 
ములుగు జిల్లాలో గోదావరి వెంట నిర్వహిస్తున్న ఇసుక క్వారీలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ తరపున తనిఖీ చేసినం. రికార్డులను పరిశీలించి నకిలీ బిల్లులు, డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అదనపు లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిస్తే చర్యలు తీసుకుంటామని ఆదేశించినం. గోదావరి నది పొడవున, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగుల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిఘా పెట్టినం. ఇసుక అక్రమ వ్యాపారం జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

 

 డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శబరీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ములుగు జిల్లా ఎస్పీ