ఆగని ఇసుక దందా మోయతుమ్మెద వాగును గుళ్ల చేస్తున్న ఇసుకాసురులు

ఆగని ఇసుక దందా మోయతుమ్మెద వాగును గుళ్ల చేస్తున్న ఇసుకాసురులు
  • ఫలించని పోలీసులు, అధికారుల చర్యలు 
  • ట్రాక్టర్లు నడుపుతున్న మైనర్లు
  • ఆందోళన పడుతున్న రైతులు

సిద్దిపేట/బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలో ప్రవహించే మోయతుమ్మెద వాగులో మళ్లీ ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. పర్మిషన్ల పేరిట పట్టపగలే యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పది రోజుల కింద బెజ్జంకి తహసీల్దార్, పోలీసులు తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాల వద్ద వాగుకు వెళ్లే రోడ్లను అడ్డంగా తవ్వి  ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నారు. కానీ అక్రమార్కులు తవ్విన రోడ్లను పూడ్చివేసి మళ్లీ ఇసుక దందాకు తెరలేపారు. 

సమీప గ్రామాల్లో ఇసుకను డంప్ చేసి సిద్దిపేట పట్టణానికి టాటాఏస్ వాహనాల్లో తరలిస్తున్నారు. మరికొందరు డంప్ లను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో మైనర్లు ఎక్కువగా పాల్గొంటున్నారు. హైస్కూల్ లో విద్యనభ్యసిస్తున్న బాలురు ట్రాక్టర్లను నడుపుతున్నారు. వీరి వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

రోజుకు 150 కి పైగా ట్రిప్పులు

రెండు రోజులుగా మోయ తుమ్మెద వాగు నుంచి దాదాపు 150 కి పైగా ట్రిప్పుల్లో  ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కొందరు స్టానిక లీడర్లు,  ట్రాక్టర్ యజమానులతో కుమ్మక్కై ఇసుక దందా మొదలెట్టారు. ఒక్కో ట్రాక్టర్​ట్రిప్పు ఇసుకను రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముకుంటున్నారు. రెండు రోజుల కింద రైతుల డిమాండ్​మేరకు శనిగరం రిజర్వాయర్ నుంచి వాగులోకి నీటిని విడుదల చేశారు. దీని వల్ల భూగర్భజల మట్టాలు పెరిగి బోర్లలోకి నీల్లొస్తాయని భావించినా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుగ్గిళ్ల, గాగిల్లాపూర్, తోటపల్లి, దేవక్క పల్లి గ్రామాల పరిధిలో దాదాపు ఐదు వందల బోర్లతో రైతులు వరి సాగు చేస్తున్నారు. 

విఫలమవుతున్న పోలీసులు

అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా ఇసుక దందాను మాత్రం పూర్తి స్థాయిలో ఆపలేకపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు డజను కేసులు నమోదు చేశారు. పెద్ద ఎత్తున ఇసుక డంప్ లను సీజ్ చేశారు. అయినా అక్రమార్కులు వివిధ దారుల్లో ఇసుకను తరలిస్తూ పోలీసుల కండ్లు గప్పుతున్నారు.

 రాత్రివేళల్లో వాగులతో పాటు కాళేశ్వరం నుంచి ఇసుకను తరలించి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. రాజీవ్ రహదారిపై హైదరాబాద్ కు వెళ్లే ఇసుక లారీలను దారి మళ్లించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు 
కోరుతున్నారు. 

ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలి

మోయతుమ్మెద వాగు నుంచి అక్రమ ఇసుక రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేయాలి. గతంలో రెవెన్యూ, పోలీసు అధికారులు రోడ్ల పై గుంతలు తీసినా వాటిని పూడ్చి మళ్లీ ఇసుక రవాణా ప్రారంభించారు. వాగులో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. రెండు రోజుల కింద రైతుల డిమాండ్ మేరకు శనిగరం ప్రాజెక్ట్ నుంచి వాగులోకి నీళ్లు వదిలినా ఇసుక తవ్వకాల వల్ల ఉపయోగం లేకుండా పోతోంది. మరోసారి పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టిపెట్టాలి. - బాలయ్య, రైతు, గాగిల్లాపూర్

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం. పది రోజుల కింద ఇసుక రవాణాను అరికట్టడానికి మోయ తుమ్మెద వాగు సమీపంలోని రోడ్ల పై గుంతలు తీసి ట్రాక్టర్లు తిరగకుండా చేశాం. గుంతలు పూడ్చి మళ్లీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇసుక రవాణాకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.   శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, బెజ్జంకి