మానేరులో జోరుగా ఇసుక అక్రమ దందా

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఆదేశాలతో మానేరు నదిలో ఇసుక రీచ్ లు బందైనా.. ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. లారీల రాకపోకలు ఆగిపోయినా.. ట్రాక్టర్లు ఇసుక లోడుతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పోర్టల్ లో బుకింగ్  చేసుకున్న ట్రాక్టర్ల కన్నా ఎక్కువగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ద్వారానే రవాణా జరుగుతోంది. నెలవారీ మామూళ్లకు ఆశపడి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది.

కరీంనగర్  జిల్లావ్యాప్తంగా ఇటు మానేరు వాగు, మోయతుమ్మెద వాగుల్లో ఇసుక దందా జోరుగా నడుస్తోంది. నిత్యం టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తూ అక్రమార్కులు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. మానేరు నదీ పరివాహక ప్రాంతమైన కరీంనగర్  రూరల్  మండలం బొమ్మకల్, ఇరుకుల్ల, చేగుర్తి, ముగ్దుంపూర్, మానకొండూరు మండలం శ్రీనివాస నగర్, వేగురుపల్లి, ఊటూరు, వెల్ది, తిమ్మాపూర్  మండలం రేణిగుంట, కొత్తపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ఈ దందా జోరుగా నడుస్తోంది. అలాగే మోయతుమ్మెదవాగు తీరంలోని చిగురుమామిడి మండలం రామంచ, నవాబుపేట, ఒగులాపూర్, బెజ్జంకి మండలం తోటపల్లిలోని తిమ్మాపూర్, గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల మీదుగా ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా జరుగుతోంది. అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్తూ వారి సహకారంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. పర్మిషన్  లేకుండానే పగలు, రాత్రి తేడా లేకుండా రోజూ వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. బీఆర్ఎస్  సర్కారు హయాంలో కేవలం ఈ ఇసుక మాఫియాను నమ్ముకునే కొందరు పోలీసు అధికారులు ఈ దందా నడిచే మండలాల్లో పోస్టింగ్  ఇప్పించుకుంటున్నారంటే  ఇసుక అక్రమ దందా ఏ స్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. 

కరీంనగర్  నుంచి హైదరాబాద్  వరకు

రాష్ట్ర  ప్రభుత్వ ఆదేశాలతో ఇసుక రీచ్ లు బంద్  అయి బుకింగ్స్  మూతపడడంతో ఇసుక మాఫియా కొత్త దారిని ఎంచుకుంది. ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో ఇసుకను డంప్  చేసి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా లారీల్లో నింపుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈనెల 13న గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో హైదరాబాద్ కు తరలించేందుకు డంప్  చేసిన 17 ట్రిప్పుల ఇసుకను సీఐ కర్రె స్వామి, ఎస్సై చందా నర్సింహారావు సీజ్  చేశారు. ఇలాంటి భారీ డంప్ లు గుండ్లపల్లిలోనే కాకుండా తిమ్మాపూర్  మండలం రేణికుంట, కొత్తపల్లి, గొల్లపల్లి తదితర గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి.

టీనేజ్  యువతే ట్రాక్టర్ డ్రైవర్లు

కరీంనగర్  జిల్లాలో ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు.. ట్రాక్టర్ డ్రైవర్లుగా 16 ఏండ్ల నుంచి పాతికేళ్లలోపు యువతనే తీసుకుంటున్నారు. వారిలో మైనర్లు, సిక్స్ వీలర్స్ కు సంబంధించిన బ్యాడ్జి లైసెన్స్ లేనివాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల మానకొండూరు మండలంలో జరిగిన యాక్సిడెంట్  కూడా ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్  డ్రైవర్  మరో ట్రాక్టర్ ను తప్పించే క్రమంలోనే జరిగిందని చెప్పుకుంటున్నారు.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్  అదుపుతప్పి సదరు డ్రైవర్  చనిపోయాడు. అలాగే నిరుడు తిమ్మాపూర్  మండలం రేణిగుంట శివారులో ఇసుక ట్రాక్టర్  రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడంతో శివరాత్రి ఆంజనేయులు, సంపత్, గుడిపల్లి అరవింద్  అనే యువకులు చనిపోయారు. అంతకు ముందు కరీంనగర్  మండలం దుర్శేడు గ్రామానికి చెందిన గాజుల రాజును ఇసుక ట్రాక్టర్  ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.