- రూ.10 వేలు ఇస్తే.. ఆడో మగో చెబుతున్న డాక్టర్లు
- లక్ష్మీదేవి, వెంకటేశ్వరస్వామి ఫొటోలే కోడ్
- ఆడపిల్ల వద్దంటే..ఆపరేషన్ ప్యాకేజీలు
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో హన్మకొండ జయశంకర్ ఏకశిల పార్క్గేటు ఎదురుగా బొక్కల దవాఖాన ఓపెన్ చేశారు. మూడు రోజుల క్రితం బుధవారం అర్ధరాత్రి టైంలో హాస్పిటల్‍కు సంబంధంలేని అబార్షన్ ఆపరేషన్ పెట్టుకున్నారు. డాక్టరేట్ లేకున్నా శంకర్‍దాదా ఎంబీబీఎస్ తరహాలో ఒకతను డాక్టర్ అవతారం ఎత్తాడు. కత్తి చేతిలో ఉన్నా ట్రీట్‍మెంట్ రాదు కాబట్టి.. మొబైల్లో యూట్యూబ్ తెరిచాడు. వణుకుతూ.. వణుకుతూ కడుపు కోశాడు. విషయం ఎలా బయటకు తెలిసిందో కానీ అదే టైంలో హెల్త్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటోళ్లు అక్కడకొచ్చి ఫేక్ డాక్టర్‍ను అరెస్ట్ చేశారు. రక్తంతో తడిసి ఉన్న మహారాష్ట్రకు చెందిన పేషెంట్‍ను దగ్గర్లోని గవర్నమెంట్ హాస్పిటల్‍కు పంపిన్రు.
వరంగల్ రూరల్, వెలుగు: చేతిలో రూ.10 వేలు పెడితే అమ్మ కడుపులోని బిడ్డకు ఆరు నెలలు పడకముందే ఆడో మగో చెప్పేస్తున్రు.. రూ.20 వేలు జేబులో పెడితే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ ఆపరేషన్లు చేస్తున్నరు.. కడుపు మీద కత్తెర గాట్లు పడాలా.. స్మార్ట్ గా పని అవ్వాలా అని అడుగుతున్నరు.. ఇంకో రూ.10 వేలు ఎక్కువిస్తే.. మెడికల్ అబ్జర్వేషన్లో టాబ్లెట్ ట్రీట్‍మెంట్ స్టార్ట్ చేస్తున్రు.. పేషెంట్ కండీషన్ సీరియస్‍గా ఉందంటూ ఇంకో ఇరవై వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నరు. మొత్తంగా పుట్టబోయే ఆడపిల్ల ప్రపంచాన్ని చూడకుండా చేసేందుకు వేలల్లో బిజినెస్ చేస్తున్నరు. ఇదంతా ఏజెన్సీ ప్రాంతాల్లోనో.. ట్రాన్స్పోర్ట్ లేని విలేజీల్లోనో కాదు.. 24 గంటలు ఫుల్ రష్ ఉండే సిటీ మెయిన్ చౌరస్తాల్లో. ఇంకా చెప్పాలంటే రాణీ రుద్రమ, సమ్మక్క సారక్కలు ఏలిన ఓరుగల్లు జిల్లాలో.
గల్లిగల్లీకో స్కానింగ్ సెంటర్
ఉమ్మడి వరంగల్ జిల్లా అక్రమ స్కానింగ్ టెస్టులకు.. అడ్డగోలు అబార్షన్లకు కేరాఫ్ అవుతోంది. ఆడ, మగ తెలిపే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా.. డాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి స్కానింగులు చేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకుంటే అబార్షన్లు చేస్తున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఇదో బడా దందాగా మారింది. వరంగల్ సిటీలోని హన్మకొండ బస్టాండ్, కాకాజీ కాలనీ, విజయ టాకీస్, రాంనగర్, నయీంనగర్, బీమారం, రామారం, కేయూసీ రోడ్డు, జులైవాడ, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశీబుగ్గ, రంగశాయిపేట, వరంగల్, శివనగర్, ఫాతిమానగర్ ఏరియాల్లోని పలు స్కానింగ్ సెంటర్లు, హాస్పిటళ్లలో .. ఈ తరహా అక్రమ టెస్టులు, అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో రేడియాలజీ, కార్డియాలజీ, గైనిక్, స్కానింగ్ సెంటర్లు180 వరకు ఉన్నాయి. మరెన్నో సెంటర్లు పర్మిషన్ లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
వారి వీక్‍నెస్.. వీరికి బిజినెస్
లింగనిర్ధారణ చేసుకునేవారిలో మగ పిల్లాడు కావాలనుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఒకరిద్దరు ఆడపిల్లలు పుట్టాక మగ సంతానం కావాలనుకునేవారు ఆర్‍ఎంపీల ద్వారా స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రేమ ముసుగులో టీనేజ్‍లో తప్పటడుగులు వేసి గర్భం దాల్చేవారు రెండోరకం. వివాహేతర సంబంధం నడిపే క్రమంలో అడ్డంగా బుక్ అవుతూ స్కానింగ్, అబార్షన్ కోసం వచ్చేవారు ఈ తరహా కేసుల్లో ఎక్కువగా ఉంటున్నారు. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే క్రమంలో.. స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు, మెడికల్ షాప్స్ఈ దందా నడిపిస్తున్నాయి. ఇందులో స్కానింగ్ సెంటర్లు టెస్టులు చేసి ప్రెగ్నెన్సీ, ఆడ మగ వివరాలు చెప్పడం మొదటిది. డాక్టర్లు దొంగచాటున క్లినిక్‍లో అబార్షన్స్ చేయడం రెండో రకం. ఇవేవీ లేకుండా నర్సింగ్ కేర్ పేరుతో ఇంటికొచ్చి టాబ్లెట్ పద్ధతిలో అబార్షన్ చేయడం మూడో దందా. సర్వీస్ ఆధారంగా బిల్లు రూ.20 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారు.
దేవుడి ఫోటోలతో చెప్పెస్తరు
పుట్టబోయే బిడ్డ ఆడ, మగ చెప్పే క్రమం లో స్కానింగ్ సెంటర్ల కోడ్ లాంగ్వేజ్ ఓపెన్ సీక్రెట్‍గా ఉంటోంది. లోపలకు ఎవ్వరిని మొబైల్ తీసుకురానివ్వరు. స్కానింగ్ అనంతరం కడుపులోని బిడ్డ అమ్మాయైతే.. ‘మీ పాప చాలా యాక్టివ్‍గా ఉందమ్మా’ అని.. బాబు అయితే ‘మీ అబ్బాయి చాలా యాక్టివ్‍గా ఉన్నాడు’ అని చెబుతారు. ఆపై ఏదో నోరు జారినట్టు ముఖం పెడుతున్నారు. సీక్రెట్‍గా ఎవరైనా వాయిస్ రికార్డు చేస్తారని భయపడేవారు సపరేట్ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. స్కానింగ్ సెంటర్‍లోని గోడలపై లక్ష్మీ దేవి, వెంకటేశ్వర స్వామి వంటి దేవుళ్ల ఫొటోలను పెడుతున్నారు. సైగలతో ఆ ఫోటోలను చూపించి సింపుల్‍గా చెప్పాల్సింది చెప్పేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారి వరకే పరిమితం కాగా ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల నుంచి సైతం జనం వస్తున్నారు. వరంగల్ ట్రైసిటీ, జిల్లా కేంద్రాల్లో రెగ్యులర్‍గా రూ. కోట్లలో సాగుతున్న ఈ దందాను ఆఫీసర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.