అక్రమ మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాల బాగోతం ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని చెరువులో అనుమతికి మించి మట్టిని తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని..ఈ విషయం గురించి ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ నేత, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు శుక్రోద్దీన్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. 

3300 క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు మాత్రమే అనుమతి తీసుకొని.. 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుకెళ్లారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ తవ్వకాలను ఆపేసి.. దీనివెనకాల ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.