మూసాపేట మండలంలో అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు..ఫీల్డ్​ విజిట్​ చేసిన ఆఫీసర్లు

అడ్డాకుల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఒక చోట తవ్వకాలకు పర్మిషన్​ తీసుకొని.. మరో చోట మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎన్​హెచ్​-44పై ఉన్న మూసాపేట మండలం వేముల స్టేజ్​ వద్ద అండర్​ పాస్​ పనులు జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ మూసాపేటలో అర ఎకరంలో మట్టి తవ్వకానికి పర్మిషన్​ తీసుకున్నాడు. అయితే తహసీల్దార్​ ఆఫీస్, పోలీస్​స్టేషన్​ ఎదురుగా ఉన్న అయ్యప్ప గుట్టపై మొరం మట్టి కోసం తవ్వకాలు చేపట్టగా స్థానికులు అడ్డుకున్నారు.

అక్కడ పనులు నిలిపివేసి కేజీబీవీ వెనక అసైన్డ్  భూముల్లో ఉన్న పలుగు గుట్ట నుంచి రాళ్లు, మట్టిని తరలించుకుపోయారు. ఇప్పుడు నెమళ్లు, జింకలకు ఆవాసంగా ఉన్న సంకలమద్ది గ్రామ సమీపంలోని  పంది గుట్టపై తవ్వకాలు చేపడుతున్నారు. సెలవు దినాల్లో తవ్వకాలు చేయడంతో గ్రామ యువకులు తవ్వకాల వీడియోలు తీసి తహసీల్దార్​ రాజుకు పంపారు. తహసీల్దార్​ స్పందించి పంది గుట్టలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, మట్టిని తరలించినట్లు తేలితే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం గుట్టను మైనింగ్  శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్  ఆఫీసర్లు పరిశీలించారు. ఎన్ని ట్రిప్పుల మట్టి కొట్టారు? ఎంత క్వాంటిటీ కొట్టారు? లెక్కలు తీసుకున్నారు. నివేదికను మైన్స్​ ఏడీకి అందజేస్తామని ఆఫీసర్లు తెలిపారు.