టన్నులకొద్దీ బియ్యం పక్కదారి..పోలీసుల దాడుల్లో బయటపడుతున్న అక్రమ నిల్వలు

  • ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్​కు తరలింపు 
  • 15 రోజులుగా వరుస దాడులు 
  • 19 మందిపై కేసులు నమోదు

సూర్యాపేట/కోదాడ, వెలుగు :కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల సరిహద్దుల్లో టన్నులకొద్దీ రేషన్​ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలో రేషన్ బియ్యం దందా పెద్ద ఎత్తున నడుస్తుండడంతో15 రోజులుగా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి బియ్యం నిల్వలపై దాడులు చేయడం విశేషం. 

బియ్యం అక్రమ రవాణాపై నిఘా..

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో కోదాడ మండలం కాపుగల్లు నుంచి 90 టన్నుల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్తుండగా ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా జగ్గయ్యపేట సమీపంలోని లింగాల అనే గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తికి ఈ బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో కోదాడ రూరల్ పోలీసులు లింగాలకు వెళ్లి దాడులు నిర్వహించి సుమారు 32.50 టన్నుల బియ్యాన్ని పట్టుకుని కోదాడకు తీసుకొచ్చారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయం ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 

రెండు నియోజకవర్గాల్లో వరుస దాడులు..

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో రాష్ట్ర సరిహద్దు ఉండడంతో రేషన్ బియ్యాన్ని సులభంగా తరలించేందుకు అవకాశం ఉంది. దీనితో సరిహద్దుల్లో నిఘా పెంచిన పోలీసులు బియ్యం స్థావరాలను గుర్తించి విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో టన్నుల కొద్దీ నిల్వలు బయటపడుతున్నాయి. మరోవైపు డీలర్ల నుంచి, ఎంఎల్ఎస్ (మండల లెవెల్ స్టాక్ పాయింట్స్) నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదాడలో డీలర్ల నియోజకవర్గ నాయకుడిగా వ్యవహరించిన మునగాల మండలానికి చెందిన ఓ డీలరు, కోదాడలో బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న మరో డీలరు నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కొందరు డీలర్లు తమకు కేటాయించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి విక్రయిస్తున్నారనే సమాచారంతో రేషన్ షాపులపై సివిల్ సప్లయ్, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు లేవని, పక్కదారి పట్టించారని తేల్చారు. 

హుజూర్​నగర్ మండలంలో ఒకరు, గరిడేపల్లి మండలంలో ఒకరు. నేరేడుచర్ల మండలంలో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. మేళ్లచెరువు మండలంలో పశువుల పాకలో భారీగా బియ్యం పట్టుబడ్డాయి. దీంతో ముగ్గురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. కోదాడ నియోజక వర్గంలో చిలుకూరు మండలంలో  ఒక డీలర్ కు  నోటీసులు జారీ చేశారు. 

భారీగా పట్టుబడుతున్న రేషన్ బియ్యం.. 

ఇటీవల జిల్లాలో చేపడుతున్న తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈనెల 5న  నిర్వహించిన వాహన తనిఖీల్లో హుజూర్ నగర్ సివిల్ సప్లై గోడౌన్ నుంచి లారీలో  ఏపీకి తరలిస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. సివిల్ సప్లై గోడౌన్ ఇన్ చార్జ్, స్టేజీ–2 కాంట్రాక్టర్, ముగ్గురు రేషన్ డీలర్లు సహా లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 15 రోజుల్లో 19 మందిపై కేసులు నమోదు కాగా, 889 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.  

పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా రేషన్ బియ్యం అక్రంగా తరలిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టాం.   

- సన్ ప్రీత్ సింగ్, ఎస్పీ, సూర్యాపేట జిల్లా