ఆఫీసర్ల ఆస్తుల్ని జప్తు చేస్తే తెలిసొస్తది

ఆఫీసర్ల ఆస్తుల్ని జప్తు చేస్తే తెలిసొస్తది
  • బఫర్‌‌‌‌ జోన్‌‌ అని తెలిసి కూడా నిర్మాణాలకు అనుమతులు ఇస్తారా?
  • అధికారులపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగుం: ఎఫ్‌‌టీఎల్, బఫర్‌‌ జోన్‌‌ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై క్రిమినల్‌‌ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని, ఇకపై వారి ఆస్తులను జప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. బఫర్‌‌ జోన్‌‌ అని తెలిసి కూడా అనుమతులు మంజూరు ఎలా చేస్తారని, అన్ని అనుమతులతో అక్కడ ఇళ్లను నిర్మించుకున్నాక అవి అక్రమ నిర్మాణాలని, కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించింది.

 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ నార్కుడ గ్రామం మంగర్షికుంట ఎఫ్‌‌టీఎల్, బఫర్‌‌జోన్‌‌లో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్‌‌ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్‌‌ జైశ్వాల్‌‌తో మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిని జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌ రెడ్డి బుధవారం విచారించారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజనీర్‌‌‌‌ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో ఎఫ్‌‌టీఎల్‌‌/బఫర్‌‌జోన్లలో నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారన్నారు. అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.