- అక్రమ కలప రవాణాపై దృష్టి పెట్టని ఫారెస్ట్ ఆఫీసర్లు
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అక్రమంగా కలప తరలిపోతోంది. ట్రాక్టర్లు, లారీల్లో సమీప అటవీ ప్రాంతాల నుంచి చెట్లను నరికి పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. జిల్లాతో పాటు సమీప జిల్లాల్లోని ఇటుక బట్టీలకు ఈ కలపను తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల కొద్దీ కలప తరలిస్తుండడంతో, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. మైదాన ప్రాంతాలుగా మారుతున్నాయి.
వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఇలా చెట్లు నరికివేతకు గురైతే పర్యావరణం ప్రమాదంలో పడనుంది. జిల్లాలో 20 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. చెట్లను నరికేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా అవేమి పట్టించుకోకుండా యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. వీటిపై దృష్టి పెట్టాల్సిన అటవీ శాఖ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ఇష్టారీతిగా నరికివేత..
తుగిలి, వేప, తుమ్మ తదితర చెట్లను నరుకుతున్నారు. అయితే ఏ చెట్టు నరకాలన్నా అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సిందే. ఎలాంటి అనుమతి తీసుకోకుండా చెట్లను నరికితే ఫారెస్ట్ ఆఫీసర్లు కలప రకాన్ని బట్టి ఫైన్ వేస్తారు. మరోసారి చెట్లు నరకకుండా చర్యలు తీసుకుంటారు. కానీ, జిల్లాలో నరకుతున్న చెట్లకు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. గతంలో గొడ్డళ్లతో చెట్లను నరికేవారు, కాగా ప్రస్తుతం డీజిల్, పెట్రోల్‌తో నడిచే రంపాలతో చెట్లను గంటల వ్యవధిలో పదులు సంఖ్యలో చెట్లను నరికి తరలిస్తున్నారు.
దళారుల ద్వారా రవాణా..
ఇటుకబట్టీలకు కలపను దళారులే సప్లై చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో కలప తీసుకెళ్తున్నా, ఫారెస్ట్ సిబ్బందికి తెలియకుండా జరుగుతుందా? అనే అనుమానం రాకమానదు. ఒక్కో బట్టీ వద్ద 25 ట్రాక్టర్లకు పైగా కలప నిల్వలు ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతంలోని చెట్లు నరకడం లేదని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నా, అక్కడక్కడ చెట్లను నరికి కలప తరలిస్తున్నారని తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం..
ఏ చెట్టును నరకాలన్నా ఫారెస్ట్ ఆఫీస్‌లో సంప్రదించి, కలప సేకరించేందుకు చలానా కట్టాలి. చలానా కట్టకుండా చెట్లను నరికి తరలించడం నేరమే. ఫారెస్ట్‌లో ఎక్కడ చెట్లు నరికినా తెలిసిపోతుంది. అయినప్పటికీ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. - నవీన్‌రెడ్డి, డీఎఫ్ వో