- పోలీస్ శాఖకు సవాల్‌గా మారిన అక్రమ రవాణా
- గతంలో అరకు, వైజాగ్‌లో స్పెషల్ఆపరేషన్
- అంతటితో ఆగిపోయిన పరిశోధన
- మళ్లీ మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ నుంచి యథేచ్చగా సప్లై
- పట్టణాల నుంచి గ్రామాలకు పాకిన గంజాయి వినియోగం
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గంజాయి మూలాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. చేతికి చిక్కినప్పుడు తప్ప.. అసలు దొంగలను కనిపెట్టడంలో డిపార్ట్మెంట్ విఫలమవుతోంది. పాత నేరస్తులపైనే ఫోకస్ పెడుతున్న పోలీసులు, కొత్తగా చలామణి అవుతున్న గంజాయి ముఠాల ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. కేవలం రెండు, మూడు నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. గతంలో బస్సులు, రైళ్లలో అర్ధరాత్రి తనిఖీలు చేసిన పోలీసులు ఇప్పుడు సైలెంటయ్యారు.
మాజీ ఎస్పీ ఏవీ రంగనాథ్ హయాంలో ఏకంగా ఆపరేషన్గంజాయి పేరుతో వైజాగ్, అరకులో దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో కొంతకాలం గంజాయి అమ్మకాలకు బ్రేక్ పడింది. కానీ మళ్లీ ఇప్పుడు పాత పద్ధతిలోనే గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. అనుమానితులను పట్టుకోవడం, కేసులు పెట్టడం వరకే పోలీసులు పరిమితమవుతున్నారు తప్ప.. మూలాలను కనిపెట్టడంలో ఆసక్తి చూపడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
హైవేలపై యథేచ్చగా రవాణా..
గత ఐదు నెలల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారుల మీదుగా గంజాయి రవాణా యథేచ్చగా సాగుతోంది. విజయవాడ-–హైదరాబాద్, నార్కట్‌పల్లి –--అద్దంకి హైవేల మీదుగా వివిధ మార్గాల్లో గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ మార్గాల్లో రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో గంజాయి రవాణాకు మార్గం మరింత సులభమైంది. ఇక ఎప్పటిలాగే బస్సుల్లో అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఒక్క జూన్‌లోనే చౌటుప్పుల్, మి ర్యాలగూడలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం
చేసుకున్నారు.
పోలీసుల కన్నుగప్పి..
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో గంజాయి రవాణాకు అడ్డు అదుపు లేకుండాపోయింది. మహారాష్ట్ర, అస్సాం, ఒడిశా, ఏపీలోని మాచర్ల ప్రాంతాల నుంచి గంజాయి సప్లై చేస్తున్నారు. దీంట్లో నల్గొండ, మిర్యాలగూడకు చెందిన గంజాయి మాఫియా పాత్ర ఉండడంతో పోలీస్‌శాఖను హడలెత్తించింది. పొరుగు రాష్ట్రాల్లో గంజాయి సాగుచేస్తున్న ముఠాతో లింక్‌లు ఏర్పరచుకుని అక్కడి నుంచి అడ్డదారుల్లో జిల్లా మీదుగా అటు హైదరాబాద్.. ఇటు నల్గొండ
మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్పట్టణాలకు సప్లై చేస్తున్నారు. గత నెలల్లో చౌటుప్పుల్పంతంగి టోల్‌ప్లాజ్ వద్ద సుమారు 300 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్-–-విజయవాడ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలించే క్రమంలో పట్టుబడ్డారు. మిర్యాలగూడలోనే ఒక్క నెలలో మూడు కేసులు నమోదు కావడం గంజాయి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏపీ నుంచి మిర్యాలగూడ, నల్గొండకు గంజాయి సప్లై జరుగుతుండగా, ఇప్పటివరకు నల్గొండలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
నల్గొండలో విచ్చలవిడిగా వినియోగం..
విశ్వనీయ సమాచారం మేరకు నల్గొండ పట్టణంలోని శివాలయం వీధి, పానగల్లు బైపాస్, గొల్లగూడెం, ఓల్డ్‌సిటీ, హైదరాబాద్‌రోడ్డులోని ఎల్లమ్మ గుడి సమీపంలో, మాన్యం చెలక, ప్రకాశం బజార్లో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కేజీల రూపంలో నల్గొండకు వచ్చే గంజాయి ఎల్లమ్మగుడి సమీపంలో చిన్నచిన్న ప్యాకెట్లుగా మారుస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బైక్ లు, ఆటోల్లో తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.