- సిండికేట్‌గా మారిన డీలర్లు, అక్రమ వ్యాపారులు
- కోదాడ నుంచి తెలంగాణ బార్డర్ దాటుతున్న రేషన్ బియ్యం
- అక్రమ రవాణాను అడ్డుకున్న వారి పైనే పోలీస్ కేసులు
సూర్యాపేట, వెలుగు : ఓ వైపు రేషన్ డీలర్లు, మరో వైపు అక్రమ వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు వీరందరికీ లీడర్‌గా వ్యవహరిస్తూ రేషన్ బియ్యాన్ని జిల్లా బార్డర్ దాటించేస్తున్నారు. ఇలా నెలకు వందలాది క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిపోతోంది.
లబ్ధిదారులకు ఇవ్వకుండా...
కోదాడ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు రేషన్ డీలర్లు బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వాటిని వ్యాపారులకు అమ్మేస్తున్నారు. అలాగే మరికొందరు వ్యాపారులు గ్రామాలు, పట్టణాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలా వివిధ మండలాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఓ చోట డంప్ చేసి అక్కడి నుంచి వివిధ వాహనాల్లో
తీసుకెళ్తున్నారు.
నాలుగు చెక్ పోస్ట్‌లు దాటి ఏపీకి..
కోదాడ.. ఏపీ, తెలంగాణ బార్డర్ ఏరియా కావడంతో తెలంగాణ నుంచి ఏపీకి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా రవాణా జరగాలంటే చిమిర్యాల వద్ద ఆర్టీఏ చెక్‌పోస్ట్, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీస్ చెక్‌పోస్ట్, గరికపాడు వద్ద ఏపీ పోలీస్ చెక్‌పోస్ట్, అనుమంచిపల్లి వద్ద ఏపీఆర్టీఏ చెక్‌పోస్టు దాటాలి. ఏపీలో పలుకుబడి కలిగిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి, కోదాడ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ లీడర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో అక్కడి చెక్‌పోస్టులను ఆ మాజీ ఉద్యోగి, ఇక్కడి చెక్‌పోస్టులను స్థానిక అధికార పార్టీ లీడర్ మేనేజ్ చేస్తూ రేషన్ బియ్యాన్ని కోదాడకు 20 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా జిల్లా షేర్ మహ్మద్‌పేటకు తరలిస్తున్నారు. అయితే సదరు లీడర్ ఇటీవల తన పరిధి దాటి మరో నియోజకర్గంలో బియ్యం కొనేందుకు ప్రయత్నించడంతో అతడిని ఆ నియోజకర్గ లీడర్ మందలించినట్లు సమాచారం.
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
రేషన్ బియ్యం సరఫరా మొత్తం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకే జరుగుతోంది. పోలీసులు పెట్రోలింగ్ చేసే టైంలోనే లోడ్‌లు తీసుకెళ్తున్నా, అక్రమ దందా వ్యవహారమంతా పోలీసులకు తెలిసినా అధికార పార్టీ లీడర్ల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడైనా బియ్యం పట్టుకున్నా దొరికిన వారిపైనే కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఇటీవల కోదాడ నుంచి ఓ ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.