భద్రాచలం, వెలుగు: ఇంటర్ స్టేట్ పర్మిట్లు లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భద్రాచలం మీదుగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన రెండు ఇసుక లారీలను ఇటీవల భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి పట్టుకున్నారు. రెవెన్యూశాఖకు అప్పగిస్తే వారు పత్రాలు పరిశీలించగా, ఇంటర్ స్టేట్ పర్మిట్ లేదని తేలింది. దీంతో ఆ రెండు లారీలకు ఫైన్ విధించారు. స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్ల అలసత్వం కారణంగా సర్కారుకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. మైనింగ్ ఆఫీసర్లు కనీస స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహించడం లేదు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
అలంకారప్రాయంగా చెక్‌పోస్టులు..
రాష్ట్రాల సరిహద్దుల్లో టీఎస్ఎండీసీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. భద్రాచలం–కూనవరం రోడ్డులో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు వెళ్లే దారిలో ఈ చెక్‌పోస్టు ఉంది. కానీ అందులో సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. ఇటీవల భద్రాచలం ఏజెన్సీలోని ఏపీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఓపెన్ అయ్యాయి. అక్కడి నుంచి లారీల్లో పెద్ద ఎత్తున భద్రాచలం మీదుగా రాష్ట్రంలోకి ఇసుక వస్తోంది. పక్క రాష్ట్రం నుంచి ఇసుక రావాలంటే తెలంగాణలో టీఎస్ఎండీసీకి టన్నుకు రూ.400 చొప్పున రాయల్టీ చెల్లించాలి. ఒక్కో లారీకి 30 టన్నులు అంటే దాదాపు రూ.12 వేల రాయల్టీ సర్కారు ఖజానాకు చేరుతుంది. కానీ సంబంధిత ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడంతో రోజుకు 50కి పైగా లారీల ఇసుక రాష్ట్రంలోకి వస్తోంది. రోజుకు దాదాపు రూ.6 లక్షల వరకు ఆదాయాన్ని టీఎస్ఎండీసీ కోల్పోతోంది. ఆఫీసర్లతో అక్రమార్కులు మిలాఖత్ అయినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణలో ఇప్పటికే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఓపెన్ అయ్యాయి. అయినా పక్క రాష్ట్రాల నుంచి ఇసుక తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయానికి గండికొడుతున్నారు.
టీఎస్ఎండీసీ దృష్టికి తీసుకెళ్లాం
పక్క రాష్ట్రం నుంచి ఇసుక లారీలు భద్రాచలం మీదుగా వెళ్తున్న విషయాన్ని టీఎస్ఎండీసీ దృష్టికి తీసుకెళ్లాం. రెండు లారీలకు ఫైన్ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం గుండా తీసుకెళ్లే ఇసుకకు ఖచ్చితంగా రాయల్టీ కట్టాల్సిందే. దీనిపై టీఎస్ఎండీసీకి ప్రపోజల్స్ కూడా పంపినం. - శ్రీనివాస్ యాదవ్, తహసీల్దార్, భద్రాచలం