జోరుగా దందా.. పర్మిట్ల మాటున అక్రమ కలప రవాణా

  • ఏపీ,ఛత్తీస్​గఢ్​ల నుంచి కలప కొనుగోలు
  • అక్రమార్కులకు సహకరిస్తున్న ఇంటి దొంగలు

భద్రాచలం,వెలుగు: ఈనెల 6న ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు టేకు కలపతో ఒక బొలేరో వాహనం వచ్చింది. చెక్​పోస్టులో ఫారెస్ట్ ఆఫీసర్లు​ ఆపి చెక్​ చేశారు. ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పూర్​ నుంచి 124 కలప సైజులు పర్మిట్​తో తెచ్చుకుంటున్నట్లు కాగితాలు చూపించారు. స్టాఫ్​కు డౌట్​ వచ్చి ఎఫ్​డీవో కార్యాలయానికి తీసుకెళ్లి చెక్ చేశారు. పర్మిట్లో ఉన్న అంకెలు వేరు, వాహనంలో ఉన్న టేకు సైజులు వేరు. 135కు పైగా దుంగలను తీసుకెళ్తున్నారు. దీనితో టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగి ఛత్తీస్​గఢ్​కు వెళ్లి విచారణ చేపడుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ వెలుగులోకి రాకుండా గుట్టుగా జిల్లాలో పక్క రాష్ట్రాల నుంచి కలపను తీసుకొచ్చి నిల్వ ఉంచుకుని, మన అడవుల్లోని టేకు కలపతో కలిపి జీరో దందా జోరుగా సాగిస్తున్నారు.  కాగా కొందరు ఇంటి దొంగలు సైతం అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారు. 

 జీరో దందా

జిల్లాకు సరిహద్దున ఉన్న ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పూర్, సుక్మా, ఏపీలోని తిరువూరు, జంగారెడ్డి గూడెం, గన్నవరం, రాజమండ్రి, గోకవరం తదితర కేంద్రాల నుంచి కలపను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు 100 అడుగుల టేకు కలప కొంటే 500 అడుగులకు పర్మిట్లు ఇస్తున్నారు. ఈ పర్మిట్​ జిరాక్స్ పత్రాల వెనుక ఫారెస్ట్ డిపార్ట్ మెంట్​ముద్ర వేస్తున్నారు. తెచ్చిన కలపను తమ కార్ఖానాల్లో కార్పెంటర్లు నిల్వ ఉంచుకుంటున్నారు. జిల్లాలోని అడవుల నుంచి టేకు సైజులను తెప్పించుకుని వాటితో తలుపులు, దర్వాజాలు, మంచాలు, కిటికీలు ఇతర గృహోపకరణాలు చేసి అమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆంధ్రా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోని కలప అమ్మే కేంద్రాల నిర్వాహకులు 50 పర్మిట్లు ఉన్న పుస్తకాలను కార్పెంటర్లకు ఇస్తున్నారు. వాటి సాయంతో జిల్లాలోని అక్రమ కలపను సక్రమంగా చూపి తప్పించుకుంటున్నారు. దీనితో జీరో కలపతో వస్తువులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు.  

ALSO READ:పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిసరాల్లో ఆంక్షలు అమలు

విచారణ జరుగుతోంది: కె.రంజిత, రేంజర్​ 

ఈనెల 6 న పట్టుబడిన కలప వాహనం గురించి విచారణ జరుగుతోంది. పర్మిట్లో ఉన్న దాని కంటే  వెహికల్స్​లో ఎక్కువ  కలప ఉంది. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు విచారణకు ఛత్తీస్​గఢ్​కు వెళ్లారు. వారు నివేదిక ఇచ్చాక యాక్షన్​ తీసుకునే అవకాశం ఉంది. కలప అక్రమ రవాణాపై దృష్టి సారించాం. అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

మూడు పువ్వులు.. ఆరు కాయలుగా..