- శిఖం భూముల్లోనే వెంచర్ల ఏర్పాటు
- మత్తడి ఎత్తు తగ్గించాలని అక్రమార్కుల ఎత్తులు
- పొరపాట్లు బయటపడకుండా వ్యూహాలు..వ్యతిరేకిస్తున్న స్థానికులు
జనగామ, వెలుగు: వరుణుడి దెబ్బకు అక్రమాలు తేటతెల్లం అవుతున్నయ్. కుంటలు, చెరువులు అని చూడకుండా ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని ఏర్పాటు చేసిన వెంచర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నయ్. జనగామ జిల్లా కేంద్రం శివారు పెంబర్తి కంబాల కుంట ఎఫ్టీఎల్పరిధిలో వెలిసిన ఓ వెంచర్ నిండా మునిగింది.
ఇదీ సంగతి..
కంబాల కుంట సమీపంలో గతంలో 25 ఎకరాల్లో ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ అప్పటి అధికార అండదండలతో రియల్ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా ప్లాట్లు చేశారు. వీటిని సునాయాసంగా అమ్ముకునేందుకు అందులోనే ఆర్టీవో ఆఫీస్‌కు ఫ్రీగా స్థలం ఇచ్చారు. ఆఫీస్ ఇక్కడికి వస్తుందని విలువలు పెంచేశారు. మార్కెటింగ్ మాయాజాలంతో ప్లాట్ల విక్రయం చేపట్టారు. ఇంకేం ఇటీవలి వానలకు సదరు వెంచర్‌లోని ప్లాట్లు దాదాపు 70 శాతం వరకు నీట మునిగిపోయాయి. ఆర్టీవో ఆఫీసు సైతం నీట మునిగింది.
నిర్లక్ష్యంతోనే..
ఆర్టీవో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి, తప్పు తమది కాదంటే తమది కాదని ఆఫీసర్లు చేతులు దులుపుకొంటున్నారు. అప్పట్లో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు స్థలం చూపిస్తే అప్పటి ఆర్అండ్బీ ఆఫీసర్లు నిర్మాణం చేపట్టారని దాటవేస్తున్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లు పర్మిషన్ ఏవిధంగా ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంచర్ చేసి అమ్మకాలు జరిపిన తంతుపైనా.. ఆఫీసర్లు సరైన సమాధానం ఇవ్వడం లేదు. అప్పటి అధికార పార్టీ బడా లీడర్లు పేరు మోసిన రియల్టర్‌తో కలిసి ఈ వ్యవహారం నడించారనే ఆరోపణలున్నాయి.
మత్తడి తగ్గించే ఎత్తుగడ..
ఆర్టీవో ఆఫీస్ ఉపయోగంలోకి తేవాలనే సాకుతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆర్టీవో ఆఫీస్ నీళ్లల్లో నుంచి బయటకు రావాలంటే కుంట మత్తడిని తగ్గించాలనే వ్యూహారు మొదలుపెట్టారు. ఎత్తు తగ్గిస్తే నీళ్లు బయటకు వెళ్లిపోయి ఆర్టీవో ఆఫీసు తేలడమే కాక వెంచర్‌లోని ప్లాట్లన్నీ సేఫ్ జోన్ లోకి వెళ్తాయనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు పెంబర్తికి చెందిన లీడర్లు.. అక్కడి జనాలకు అభ్యర్థనలు చేస్తుండగా వారు ససేమిరా అంటున్నారు.
కలెక్టర్‌కు నివేదించాం..
వెంచర్లో బిల్డింగ్ నిర్మాణ విషయంలో గతంలో ఏం జరిగిందో తెలియదు. మా ఆర్టీఏ కార్యకలాపాలకు అనుగుణంగా బిల్డింగ్ నిర్మాణం జరగడంతో ఇటీవల అందులోకి మార్చాం. ఇప్పుడు వానలతో ఆఫీస్‌లకు నీళ్లు వచ్చినయ్. సేవలకు అంతరాయం కాలుగవద్దని తాత్కాళికంగా రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్‌లో సేవలందిస్తున్నం. ఆఫీస్ నీట మునిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదించిన. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటం.
- సింగం శ్రీనివాస రావు, జిల్లా రవాణా శాఖ అధికారి, జనగామ