కబ్జాల డొంక కదిలింది..ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బీఆర్ఎస్​ లీడర్ల  అక్రమాలు

కబ్జాల డొంక కదిలింది..ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బీఆర్ఎస్​ లీడర్ల  అక్రమాలు
  • నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్​ భూములకు నాలా కన్వర్షన్లు
  • తాజాగా మరో నేత అరెస్ట్, కేసుల భయంతో మూడెకరాల భూమిని వాపస్  చేసిన బీఆర్ఎస్ లీడర్

కరీంనగర్/సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ ఆఫీసర్లు తవ్వుతున్న కొద్ది బీఆర్ఎస్  లీడర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పీవోటీ చట్టానికి తూట్లు పొడుస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల దగ్గర అసైన్డ్  భూములు, ఖాళీగా ఉన్న సర్కార్  భూములను కొల్లగొట్టిన ఉదంతాలు బయటికొస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భార్య హైమావతి

బీఆర్ఎస్  మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బీఆర్ఎస్  లీడర్ బొల్లి రామ్మోహన్  పేరిట లావుణీ పట్టాలు జారీ అయిన వ్యవహారం వెలుగు చూసింది. బీఆర్ఎస్  లీడర్ల భూదందాలు వరుసగా బయటికొస్తుండడంతో ఈ వ్యవహరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎంక్వైరీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏ కమిషనర్​ నవీన్ మిట్టల్  జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 

 బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి భార్య పేరిట 3.20 ఎకరాలకు పట్టా

ప్రభుత్వ భూములను పట్టా చేయించుకున్నవారిలో బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  ప్రధాన అనుచరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన భార్య హైమావతి పేరిట ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలోని 119/4 సర్వే నంబర్ లో 3.20 ఎకరాల భూమికి లావుణీ పట్టా జారీ అయింది.  వెంకటాపురంలో సర్కార్  భూమిని అసైన్డ్  చేయడానికి అర్హులైన పేదలు, కూలీలు ఎంతో మంది ఉన్నప్పటికీ.. ఎల్లారెడ్డిపేటలో ఉండే బీఆర్ఎస్  లీడర్, ఆర్థికంగా బలంగా ఉన్న ఆగయ్య కుటుంబానికి లావుణీ పట్టా మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది.

ఈ విషయం కలెక్టర్  దృష్టికి వెళ్లడంతో గత నెలలో ఈ భూమిని గవర్నమెంట్ ల్యాండ్​గా ధరణి రికార్డుల్లో మార్చేశారు. ఆగయ్య 1990 లో నక్సలైట్ గా పని చేశారు. ఆయనకు పునరావాసం కింద ప్రభుత్వ భూమిని కేటాయించారని చెప్పుకుంటున్నారు. కానీ, ఈ భూమి తన పేరు మీద కాకుండా భార్య పేరిట ఉండడం అనుమానాలకు తావిస్తోంది. 

మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య పేరిట 2.17 ఎకరాలు.. 

తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్  మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్యకు ఇదే మండలం తాడూరులో 3 ఎకరాల పట్టా భూమి ఉంది. కానీ, ఆయన ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 1148/3/అ సర్వే నంబర్ లోని కనగర్తి పోచయ్య పేరు మీద ఉన్న అసైన్డ్​ ల్యాండ్ 13 గుంటలు తన పేరు మీదకు మార్చుకున్నాడు. అలాగే బైండ్ల సాయబు పేరిట 1148/2ఈ  సర్వే నంబర్ లోని 5 గుంటలు, 1148/3ఇ లోని 23 గుంటల భూమిని అంతయ్య ఎల్ఆర్ యూపీలో తన పేరిట మార్చుకున్నారు. అలాగే 1148/3ఆలోని 14 గుంటలు, 1148/అ/1లోని 22 గుంటలు,  1148/3అ/1లోని 20 గుంటల అసైన్డ్  ల్యాండ్  కూడా అంతయ్య పేరిట నమోదైంది. 

– సిరిసిల్లకు చెందిన వ్యాపారి, బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ కు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 555/2/3లో 1.1650 ఎకరాలు, 555/2/4/2/1/2లో 22 గుంటల లావుణీ పట్టా ఉంది. స్థానికేతరుడు, ఆర్థికంగా స్థితిమంతుడైన రామ్మోహన్ కు బద్దెనపల్లిలో అసైన్డ్  ల్యాండ్  ఉండడం వివాదాస్పదంగా మారింది. 

Also Read :- చిరుధాన్యాలే .. ఆదివాసీల హెల్త్​ సీక్రెట్

– బీఆర్ఎస్  లీడర్, నేరేళ్ల పీఏసీఎస్  డైరెక్టర్  అబ్బాడి అనిల్ కు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 1183/5లోని 2 ఎకరాల అసైన్డ్​ భూమి ఉంది. అరెస్టుల భయంతో ఈయన కూడా కొంత కాలంగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. 

పీవోటీ చట్టం ఏం చెబుతోంది.. 

అసైన్డ్  భూములను ఇతరులకు అమ్మడం, తాకట్టు పెట్టడం, కౌలుకు ఇవ్వడం, దానం చేయడం లేదా మరే విధంగానైనా అన్యాక్రాంతం చేయకూడదని అసైన్డ్  భూముల బదలాయింపు నిషేధ చట్టం(1977) పేర్కొంటోంది. ఈ చట్టాన్నే పీవోటీ చట్టం లేదా 9/77 చట్టం అని అంటారు. దీని ప్రకారం అసైన్డ్  భూములను వారసత్వంగా మాత్రమే అనుభవించాలి. ఎవరైనా కొనుగోలు చేసినా ఆ లావాదేవీ చెల్లదు. చట్ట ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా భూమిలేని పేదవారు అసైన్డ్  భూమి కొనుగోలు చేస్తే, వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికే అసైన్మెంట్  పట్టా జారీ చేయొచ్చని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో బీఆర్ఎస్  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో చాలా మంది సంపన్నులైన బీఆర్ఎస్ లీడర్లు అసైన్డ్  ల్యాండ్స్ ను అగ్గువకు కొనుగోలు చేసి పాస్ బుక్స్  పొందినట్లు సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలను బట్టి తెలుస్తోంది. 

పీవోటీ చట్టానికి విరుద్ధంగా రీ అసైన్ మెంట్.. 

ప్రభుత్వం జారీ చేసిన జీవోను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్  సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తమ్ముడు జిందం దేవదాసు వంటి బడా కాంట్రాకర్  అసైన్డ్ ల్యాండ్స్ ను కొల్లగొట్టారు. సిరిసిల్లకు చెందిన జిందం దేవదాసు తంగళ్లపల్లి మండలం సారంపెల్లి శివారులోని 164/3లో పీవోటీ చట్టానికి విరుద్ధంగా ఓ అసైనీ వద్ద  తక్కువ ధరకు 3 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

కొనుగోలు చేసిన వ్యక్తి కూడా స్థానికుడై, భూమి లేని పేద రైతు అయి, అదే భూమిపై ఆధారపడితేనే రీఅసైన్ చేయాలి. కానీ, జిందం దేవదాసు ఐటీ రిటర్న్స్  ఫైల్  చేస్తున్న పేరుమోసిన కాంట్రాక్టర్. అప్పట్లోనే అతడికి నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి తహసీల్దార్  పట్టించుకోకుండా పాస్‌‌‌‌బుక్  జారీ చేశారు. 

‌‌‌‌‌‌‌‌కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం..

సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్  లీడర్ల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ సీనియర్  లీడర్  బొల్లి రామ్మోహన్, అగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తంగళ్లపల్లి మండలం నేరేళ్ల పీఏసీఎస్  చైర్మన్, బీఆర్ఎస్  సీనియర్  లీడర్  పూడూరి భాస్కర్ ను రిమాండ్ కు తరలించారు.

భాస్కర్  మండేపల్లిలో 20 గుంటల అసైన్డ్ ల్యాండ్ ను అక్రమంగా పట్టా చేసుకున్నారని రెనెన్యూ ఆపీసర్లు తేల్చడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తంగళ్లపల్లి మండలానికి చెందిన మరో నలుగురు నాయకులు పరారీలో ఉన్నట్లు సమాచారం.  

భూమి వాపస్  చేసిన మరో బీఆర్ఎస్  లీడర్.. 

అక్రమంగా పట్టా చేసుకున్న అసైన్డ్  ల్యాండ్, కబ్జా భూములు వాపస్ చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 464లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్  లీడర్  సుంచుల కుమారస్వామి మంగళవారం కలెక్టర్ ను కలిసి ఆ భూమిని వాపస్  చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 2న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్  మాజీ సర్పంచ్  మిట్టపల్లి పద్మ 2 ఎకరాల భూమిని కలెక్టర్  సందీప్ కుమార్ ఝాకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కేసులు నమోదు అవుతుండడంతో కబ్జా, అక్రమ పట్టాదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్వచ్ఛందంగా భూములను అప్పగిస్తున్నారు.