హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని ప్రభుత్వ అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డ మార్తువారిగూడానికి చెందిన మార్తి సురేందర్‌రెడ్డి, బొమ్ము శ్రీనివాస్, మాజీ వీఆర్వో ముదిగొండ సుమన్‌ను గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తుమ్మడంలో 9 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ర్టేషన్ చేశారనే అభియోగంపై గతంలో తహసీల్దార్లుగా పని చేసిన మందడి నాగార్జునరెడ్డి, దేశ్యానాయక్, నాగరాజు, వీఆర్వో సుమన్‌తో పాటు మార్తి సురేందర్‌రెడ్డి, బొమ్ము శ్రీనివాస్ మరికొందరిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
2007లో నిడమనూరు తహసీల్దార్‌గా విద్యాసాగర్ ఉన్న టైంలో అతడి సంతకాన్ని ఫోర్జరీ చేసిన వీఆర్వో సుమన్ గ్రామ శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన మార్తి సురేందర్‌రెడ్డి, బొమ్ము శ్రీనివాస్‌తో పాటు మరికొందరికి పట్టా చేశాడు. దీంతో 2022లో ఓ అడ్వొకేట్ హైకోర్టులో కేసు వేయగా సమగ్ర విచారణ చేయాలని ఆదేశించింది. అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదేశాల మేరకు నిడమనూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తర్వాత నల్గొండకు బదిలీ చేశారు.
ఈ కేసుతో సంబంధం ఉందంటూ గురువారం నిడమనూరు మండలంలో అప్పట్లో తహసీల్దార్లుగా పని చేసిన మందడి నాగార్జున రెడ్డి, దేశ్యానాయక్, ఏఆర్ నాగరాజు, తుమ్మడం వీఆర్వోగా పని చేసిన ముదిగొండ సుమన్‌తో పాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పని చేసిన తహసీల్దార్ ఎడ్ల ప్రమీల, విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు వీఆర్వో సుమన్, మార్తి సురేందర్‌రెడ్డి, బొమ్ము శ్రీనివాస్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. కేసులో 9 మందికి సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు, మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.