
- ప్రైవేట్ వెంచర్లకు, హైవేకు గ్రావెల్ తరలింపు
- గతంలో బీఆర్ఎస్ నేతల దందాకు అడ్డుచెప్పని ఆఫీసర్లు!
- కాంగ్రెస్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం
- రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారుల ఎంక్వైరీ
- అక్రమంగా తవ్వారని నిర్ధారించిన ఆఫీసర్లు
- నష్టం విలువ తేల్చేందుకు జాయింట్ సర్వేకు ఆదేశం
ఖమ్మం/ కూసుమంచి, వెలుగు : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఖమ్మం జిల్లా పాలేరు లో గతంలో బీఆర్ఎస్ లీడర్లు చేసిన మట్టి దందా వెలుగులోకి వచ్చింది. కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలోని శ్రీరామచంద్రస్వామి దేవాలయ భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వుకొని, ప్రైవేట్ వెంచర్లకు, హైవే నిర్మాణానికి అమ్ముకున్నారు. అనుమతులు లేకుండానే జేసీబీలు, ప్రొక్లెయిన్లతో తవ్వకాలు జరిపి లారీలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించారని తేలింది.
కొన్ని నెలల పాటు సాగిన ఈ మట్టి దందాకు అప్పట్లో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు కూడా అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. దేవాలయ భూముల్లో మట్టి ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించిన గ్రామస్తులకు, తమకు అన్ని అనుమతులున్నాయని అప్పట్లో ఆ లీడర్లు చెప్పారు. మైనింగ్, రెవెన్యూ అనుమతి పత్రాలను చూపించాలని కోరిన వారిని బెదిరించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ నేతలు మరోసారి ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. తాజాగా రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారులు కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దేవాలయ భూముల్లోని 17 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించారు.
ట్రక్కుల లెక్కన అమ్ముకున్నరు..
జీళ్లచెరువు గ్రామంలో ఉన్న శ్రీరామచంద్రస్వామి దేవాలయ భూమి 72 ఎకరాలు, ఇనాం భూమి 7.20 ఎకరాలు ఉంది. ఇందులో దాదాపు 62 ఎకరాల భూమి సేద్యంలో ఉంది. దాదాపు 17 ఎకరాల్లో అదే గ్రామానికి చెందిన ఒక బీఆర్ఎస్ నేత ఎటువంటి అనుమతి లేకుండా మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఖమ్మం, సూర్యాపేట హైవే నిర్మాణ పనులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రైతులకు, బీటీ రోడ్ల నిర్మాణాలకు, వేల మెట్రిక్ టన్నుల మట్టి ట్రక్కుల లెక్కన అమ్ముకున్నారు.
మండలంలోని కేశవపురం గ్రామానికి చెందిన తన్నీరు హరీశ్ఇటీవల తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం ఖమ్మం ఆర్డీవో గణేశ్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మైనింగ్ ఏడీ సంజయ్ కుమార్, ఇరిగేషన్ డీఈ రత్నకుమారి, కూసుమంచి తహసీల్దార్ సంపత్ కుమార్, ఈవో నారాయణచార్యులు ఆధ్వర్యంలో ఆలయ భూములను పరిశీలించారు.
గ్రామస్తులతో మాట్లాడారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ, మైనింగ్ అధికారులు సర్వే చేసి ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురైంది? ఎన్ని ఎకరాల్లో అక్రమంగా మట్టిని తవ్వారు? ఎన్ని వేల మెట్రిక్ టన్నుల మట్టిని అమ్మారు? తదితర విషయాలను తేల్చాలని అధికారులను ఆర్డీఓ ఆదేశించారు.
మద్దులపల్లిలోనూ మట్టి తరలింపు..
ఖమ్మం రూరల్మండలంలోని మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని కేటాయించగా, అందులోని మట్టి గుట్టలను కూడా తవ్వి గ్రావెల్ ను ఓ బీఆర్ఎస్ నేత అమ్ముకున్నట్టు తేలింది. గత నెలలో మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించిన సమయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై ఎంక్వైరీకి ఆదేశించారు. జీళ్లచెర్వుల్లోని దేవాలయ భూముల్లో మట్టి తవ్వకాలు కూడా ఆ లీడర్ పనేనని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, అక్రమాల విలువను నిర్ధారించడంతో పాటు జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని అధికారులను కోరారు.
చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం
గత ఐదేండ్లలో జీళ్లచెర్వు దేవాలయ భూముల్లో ఎలాంటి తవ్వకాలకు అనుమతినివ్వలేదు. అక్రమంగా జరిగిన తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులతో ఎంక్వైరీ జరుగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
ఎ.సులోచన, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్