వనపర్తి జిల్లాలో మిల్లర్ల మాయాజాలం

వనపర్తి జిల్లాలో మిల్లర్ల మాయాజాలం
  • సీఎంఆర్ రైస్ లో కర్ణాటక నూకలు!
  • సివిల్​సప్లై ఆఫీసర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల దందా
  • పీడీఎస్​బియ్యం తినలేక పోతున్నామంటున్న పేదలు

 

వనపర్తి, వెలుగు: జిల్లాలో సీఎమ్మార్  బియ్యం కల్తీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ షాపులకు  ఇచ్చే బియ్యంలో సగానికి సగం నూకలు వస్తున్నాయని పేదలు వాపోతున్నారు. బియ్యం తినలేక బయట కొనుక్కొని తింటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం తీసుకునేటప్పుడు నాణ్యతను పరీక్షించాల్సిన సివిల్ సప్లై  ఆఫీసర్లు మిల్లర్లతో కుమ్మక్కై  చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. బియ్యంలో నూక లతో పాటు ఇతర వ్యర్థాలు కూడా రావడంతో పశువులకు దాణాగా వాడుతున్నామని చెప్తున్నారు. 

5 వేల టన్నుల రేషన్​ బియ్యం..

జిల్లాలో మొత్తం 327 రేషన్ షాపులు ఉన్నాయి.  ప్రతి నెల 5 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని డీలర్లు గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అయితే కొంత కాలంగా సీఎంఆర్​కోటా కింద మిల్లర్ల నుంచి వచ్చిన బియ్యాన్ని డైరెక్ట్​గా రేషన్​షాపుల్లో పంపిణీ చేస్తున్నారు.  మిల్లుల నుంచి బియ్యం తీసుకునే సమయంలో సివిల్​సప్లై ఆఫీసర్లు నాణ్యత పరీక్షించాలి. కానీ ఆఫీసర్లు మిల్లర్లతో మిలాఖత్​అయి పట్టించుకోకపోవడంతో  బియ్యంలో ఎక్కువగా నూకలు, మట్టి పెల్లలు, చెత్త వస్తోందని తినలేక పశువులకు దాణాగా వాడుతున్నామని చెప్తున్నారు. బయట మార్కెట్​లో  బియ్యం కొనలేని వారు అలాగే తింటే రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో దళారులు పేదల వద్ద తక్కువకు కొని మిల్లర్లకు అమ్ముతున్నారు. మిల్లర్లు రీసైక్లింగ్​చేసి సీఎంఆర్ రూపంలో పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో  బియ్యం పూర్తిగా పాతబడి ముక్క వాసన వస్తున్నాయని వాపోతున్నారు.  

కర్ణాటక నుంచి నూకలు.. 

పక్క రాష్ట్రం కర్ణాటక, మిర్యాలగూడ నుంచి కొంద రు మిల్లర్లు లారీల కొద్ది నూకలు తెచ్చి సీఎంఆర్  బియ్యంలో  కలుపుతూ కల్తీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా సివిల్​సప్లై ఆఫీసర్ల కనుసన్నల్లోనే  జరుగుతున్నా పట్టించుకుంటలేరని పలువురు చెప్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి సివిల్ సప్లై శాఖకు అందించాలి. రూల్స్ ప్రకారం ఆ బియ్యంలో10 శాతం కంటే ఎక్కువ నూకలు ఉండకూడదు. కానీ 30 శాతం నూకలు ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. సివిల్ సప్లై శాఖ పనితీరు, 
మిల్లర్ల అక్రమాలపై  పలు ఫిర్యాదులు వస్తున్నా జిల్లా యంత్రాంగం సంబంధిత మిల్లర్లపైనా, ఆఫీసర్లపైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  

10 కిలోల బియ్యంలో 4 కిలోల నూకలుంటన్నయ్​

 నాకు వచ్చిన రేషన్​బియ్యం చెరిగితే 10 కిలోల బియ్యంలో 4 కిలోల నూకలు, వ్యర్థాలు వస్తున్నాయి. దీంతో బియ్యం సరిపోక బయట కొంటున్నం. దీనిపై డీలర్లపై గొడవపడినా పై నుంచే  ఇట్ల వస్తున్నాయని  చెపుతున్రు. 
-  రాములమ్మ, తూంకుంట, వీపనగండ్ల మండలం

డీలర్లు ఇబ్బంది పడుతున్నరు

 రేషన్​బియ్యంలో నూకలు వస్తున్నాయని ప్రజలు నిత్యం డీలర్లతో గొడవపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో డీలర్లు ఇబ్బంది పడుతున్నరు. 40 కేజీల బస్తాలో 3, 4 కేజీలు తగ్గించి పంపుతున్రు. 
- బచ్చు రాము,  రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు        

నూకలు లేకుండా చూస్తాం

 రూల్స్​ప్రకారం రేషన్​బియ్యం నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నం. మిల్లర్లు కర్ణాటక నుంచి నూకలు తెచ్చి సీఎంఆర్ బియ్యంలో కలిపినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. అన్ని స్టాక్ పాయింట్లను అలర్ట్​చేసి నూక శాతం తగ్గించే విధంగా చూస్తాం.
- కొండల్ రావు, సివిల్​సప్లై డీఎం