రిమోట్ కంట్రోల్​తో పత్తి రైతులను ముంచుతున్రు..

  •    ఆదివాసీ పల్లెలే అక్రమార్కుల టార్గెట్
  •     క్వింటా వద్ద 10 నుంచి 20 కిలోల వరకు మైనస్​
  •     అక్కడక్కడ పట్టుబడుతున్నా పట్టించుకోని అధికారులు 
  •     భారీగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం కేంద్రంగా కొందరు అక్రమార్కులు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ  పత్తి రైతులను ముంచుతున్నారు. ఆదివాసీ పల్లెలే వారి టార్గెట్. ఎలక్ట్రానిక్​ కాంటాలను రిమోట్​ కంట్రోల్​తో ఆపరేట్​​ చేస్తూ  అందినకాడికి దోచుకుంటున్నారు. శుక్రవారం రాత్రి చర్ల మండలం మారుమూల చింతగుప్పలో పత్తిని కొనుగోలు చేసేందుకు ఆటోల్లో తొమ్మిది మంది ప్రైవేటు వ్యాపారులు వెళ్లారు. 

వారు ముందుగానే తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్​ కాంటాలో 10 నుంచి 20 కిలోల వరకు మైనస్​లో సెట్​ చేసుకున్నారు. కాంటా సమయంలో తమ జేబులో ఉన్న రిమోట్​సాయంతో వేయింగ్​ మిషన్​ను  మేనేజ్​ చేస్తున్నారు. ఏడున్నర క్వింటాళ్ల పత్తిని ఐదున్నర క్వింటాళ్లే ఉన్నట్లుగా రైతులను మోసం చేశారు. రైతుల అంచనా కన్నా పత్తి చాలా  తక్కువ రావడంపై అనుమానం వచ్చి వ్యాపారులను నిలదీశారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్ని దేహశుద్ధి చేశారు. తప్పుఒప్పుకున్న వ్యాపారులు కాళ్ల బేరానికి వచ్చారు. నష్టపరిహారం చెల్లించి అక్కడి నుంచి జారుకున్నారు. 

మన్యంలో నిత్యకృత్యం..

భద్రాచలంలోని ప్రైవేటు లాడ్జీల్లో మహబూబా​బాద్, కొత్తగూడెం చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చిన వ్యాపారులు మకాం వేస్తున్నారు. తమ వద్ద ఉండే కొందరు యువకులకు ఆటోలు, ఎలక్ట్రానిక్​ కాంటాలు ఇచ్చి గిరిజన పల్లెలకు రాత్రి వేళల్లో పంపుతున్నారు. ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.6,900 ఇస్తోంది. కానీ గిరిజన రైతుల నుంచి క్వింటా రూ.6,100- నుంచి రూ.6,300 చెల్లించి కొంటున్నారు. ధరలో వ్యత్యాసంతో పాటు, కాంటా మోసాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ దందా మన్యంలో నిత్యకృత్యంగా మారింది. ‘సీసీఐ’ కొర్రీలు భరించలేక 

దళారుల చేతుల్లో మోసపోతున్రు..  

రైతులు పత్తిని కాటన్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (సీసీఐ)కు తీసుకెళ్లాలంటే అక్కడ అధికారులు పెట్టే కొర్రీలు భరించలేక ఊళ్లలోకి వచ్చే దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. కాంటా మోసాలు ఇప్పుడే కొత్తేమీ కాదు. గతంలో దుమ్ముగూడెం మండలం మానుగుట్టలో 18 క్వింటాళ్ల పత్తిని రిమోట్​ కంట్రోల్​ ద్వారా కాంటాను మేనేజ్​ చేసి 11 క్వింటాళ్లే చూపించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

 ఇదే మండలం బురదమడుగు, గౌరారంలలోనూ ఇదే తరహా మోసాన్ని గుర్తించిన ఆదివాసీ రైతులు వ్యాపారులను పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. భద్రాచలం నియోజకవర్గంలో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడం కూడా గిరిజన రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడక్కడ అక్రమ వ్యాపారులను పట్టిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులను అరికట్టడంలో, వారి కాంటా మోసాలను గుర్తించడంలో తూనికలు కొలతల శాఖ పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఆగడాలను అరికట్టాలి 

గిరిజన రైతులను మోసగిస్తున్న ప్రైవేటు పత్తి వ్యాపారుల ఆగడాలను అధికారులు అరికట్టాలి. ప్రతీ సంవత్సరం కాంటాల్లో మోసం జరుగుతున్నా.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. దీంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 
-
 పాయం సత్యనారాయణ, గోండ్వాన సంక్షేమ పరిషత్​ రాష్ట్ర అధ్యక్షులు