భీంగల్ లోని రాతం చెరువు కనుమరుగు

భీంగల్ లోని రాతం చెరువు కనుమరుగు
  • కబ్జాకోరల్లో చెరువు శిఖం
  • నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు
  • కందకం తవ్వినా ఆగని నిర్మాణాలు
  • చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్​

బాల్కొండ, వెలుగు: భీంగల్ లోని రాతం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది.  గతంలో భీంగల్ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చిన రాతం చెరువులో అక్రమ నిర్మాణాలతో దీని ఉనికి కనుమరుగవుతోంది.  ఒకప్పుడు తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న ఈ చెరువు శిఖం కబ్జాకు గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మార్కెట్ లో భూముల ధరలకు రెక్కలు రావడం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాలు లేకపోవడంతో కొందరు అక్రమార్కులు కనిపించిన స్థలాలను కబ్జాచేసే పనిలో ఉన్నారు. 

చెరువు శిఖంలో  నిర్మాణాలు

పట్టాభూమిలో ఇల్లు నిర్మించిన  కొందరు చెరువు శిఖంలోనూ నిర్మాణాలు చేపడుతున్నారు.  ప్రధాన రహదారికి ఆనుకుని భవన నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాతం చెరువులో   నిర్మాణాలు జరుగుతున్నా  అధికారులు తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తమకేమీ కాదన్న ధోరణితో పలుకుబడి ఉన్న బడాబాబులు అక్రమాలకు పాల్పడుతున్నారు. శిఖంలో వెంచర్ల ఏర్పాటు, ప్లాట్లల్లో నిర్మాణాలు జరుగుతున్నా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కందకం తవ్వి, బోర్డు పెట్టినా..

గతంలో రెవెన్యూ ఆఫీసర్లు అక్రమ నిర్మాణాల నియంత్రణకు చెరువు శిఖంలో కందకం తవ్వి బోర్డులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఏర్పాటు చేసిన బోర్డులు మాయం చేశారు.  బస్టాండ్ వెనుక స్థలంలో కొందరు కూల్చేసిన ఇళ్ల మట్టిని ఖాళీ స్థలంలో వేసి కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

ఆగని అక్రమ నిర్మాణాలు

బాల్కొండలో  సఫిల్ కట్ట, నాగుల కుంట, సాయి కుంట ల్యాండ్ ను రియల్టర్లు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. కబ్జాలను అరికట్టేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు కందకాలు తవ్వి మధ్యలోనే వదిలేశారు. కాలువ పూడ్చి ప్లాట్లుగా మార్చి నిర్మాణాలు చేపట్టారు. ముప్కాల్ మండల కేంద్రంలోని హైవేకు ఆనుకుని ఉన్న చెరువులో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కొందరు ఇళ్లు నిర్మించినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే   చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినవారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.