లేని భూమికి రైతుబంధు..బ్యాంక్ లోన్ కూడా తీసుకున్న అక్రమార్కులు

లేని భూమికి రైతుబంధు..బ్యాంక్ లోన్ కూడా తీసుకున్న అక్రమార్కులు

సూర్యాపేట, వెలుగు:  ధరణిలో లోపాలను అడ్డు పెట్టుకొని భూమి లేకున్నా రెవెన్యూ ఆఫీసర్లు పాస్ పుస్తకాలు మంజూరు చేయగా.. కొందరు అక్రమార్కులు ఆ భూములకు రైతు బంధుతోపాటు బ్యాంకు లోను కూడా తీసుకున్నారు. అయితే, అసలు రైతులు ఫిర్యాదు చేయడంతో బండారం బట్టబయలైంది.  సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలో ఈ ఘటన జరిగింది.  పోలీసులు అక్రమంగా పట్టా చేయించుకున్న ముగ్గురు అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. వర్ధమానుకోట గ్రామ రెవెన్యూ పరిధిలోని 518 సర్వే నెంబర్ లో 8 మంది రైతుల పేరు పై 18.35 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన గుంటకండ్ల నర్సింహా రెడ్డి, గుంటకండ్ల జలేందర్ రెడ్డి, గుంటకండ్ల రాజశేఖర్ రెడ్డి పేరున 10 గుంటల భూమి ఉంది.  2020 సంవత్సరంలో తహసీల్దార్​గా పని చేసిన శ్రీకాంత్ ముగ్గురితో కలిసి ఆర్ఎస్ఆర్ ( రీ సర్వే సెటిల్ మెంట్ రికార్డ్) లో భూమి విస్తీర్ణాన్ని 18.35 ఎకరాల నుంచి 21.10 ఎకరాలకు పెంచారు. దీంతో భూమి లేకున్నా 2021 నుంచి ఈ పెంచి విస్తీర్ణానికి రైతు బంధు వస్తుండగా, అక్రమార్కులు బ్యాంక్ లోన్ సైతం తీసుకున్నారు.

రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి..

పట్టా ఉండడంతో ఆ భూమి మొత్తం తమదే అంటూ అక్రమార్కులు రైతులతో గొడవపడ్డారు. భూమిని ఆక్రమించుకొని సాగు చేసే ప్రయత్నం చేయడంతో రైతులు.. రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 518 సర్వే నెంబర్ లో 18.35 ఎకరాల భూమి మాత్రమే ఉందని, తహసీల్దార్​ అక్రమంగా ఆర్ఎస్ఆర్ రికార్డ్ లో 2.10 ఎకరాల భూమి విస్తీర్ణాన్ని పెంచి 21.10 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చారని రెవెన్యూ ఆఫీసర్లు తేల్చారు. దీంతోపాటు అక్రమ పట్టా చేయించుకున్న నర్సింహారెడ్డి, జలేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

చర్యలు తీసుకోవాలి

అక్రమంగా భూమి పట్టా చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.  తమకు సంబంధం లేని 2.10 ఎకరాల భూమిని పట్టా చేసుకొని బ్యాంకు రుణాలతో పాటు రైతుబంధు అక్రమంగా పొందుతున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, మాకు న్యాయం చేయాలి.  –వెంకట్​రెడ్డి, రైతు