గ్రామాల్లో సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి ఎందుకు వస్తున్నారంటూ అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించని మీకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు. తాజాగా మరోసారి ఇల్లందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు నిరసన సెగ తగిలింది. ఇంతకుముందు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హరిప్రియను అడ్డుకుని ఆందోళన చేశారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యా తండాలో ఇల్లెందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్ వాహనాన్ని ప్లకార్డులతో అడ్డుకున్నారు గ్రామస్తులు. గో బ్యాక్ హరిప్రియ అంటూ నినాదాలు చేశారు తండా వాసులు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులకు, తండావాసులకు మధ్య ఘర్షణ జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో కోట్యా తండాలో ఉద్రిక్తత ఏర్పడింది. తండాకు ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యే హరిప్రియని నిలదీశారు.
అక్టోబర్ 25వ తేదీన.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదంటూ సింగారం గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, హరిప్రియకు మధ్య వాగ్వివాదం జరిగింది. అధికార పార్టీ, స్థానిక నాయకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట గ్రామంలో తమ ఇల్లు కూలేపోయే స్థితిలో ఉందంటూ ఓ మహిళ ఎమ్మెల్యే హరిప్రియ చేయి పట్టుకుని తమ ఇంటికి తీసుకుపోయింది. తమ పరిస్థితిని తెలియజేసింది. తమకు డబుల్బెడ్రూమ్ ఇల్లు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హరిప్రియ నాయక్ ఎంత వారించినా గ్రామస్తులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రశ్నల వర్షం కురిపించారు.
- ALSO READ | 6+6 భద్రత కల్పించాలి : డీజీపీకి రేవంత్ లేఖ
అక్టోబర్ 29వ తేదీన.. ఇల్లందు మండలం కొమరారంలో ప్రచారానికి వెళ్లిన హరిప్రియ నాయక్ ను నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ గ్రామానికి అభివృద్ధి చేయలేదని, కొమరారం మండలం ఏర్పాటుకు కృషి చేయలేదని నిలదీశారు. పోడు పట్టాల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్నారు. అర్హులైన వారికి గృహలక్ష్మీ పథకం వర్తించలేదని చెప్పారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అడ్డుకున్నారు.