- ప్రారంభించి ఏడు నెలలైనా సౌకర్యాలు కల్పించట్లే
- కొత్త బస్సులు ఇయ్యలే.. కొత్తరూట్లకు బస్సులు లేకపాయే
- ఇతర డిపోల నుంచి ఇచ్చిన 26 బస్సులతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి
- ఆదాయంలో కొత్తగూడెం డిపోతో పోటీ.. అయినా పట్టించుకోని అధికారులు
- అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే గత ప్రభుత్వం డిపో పేరుతో హడావుడి!
- ఏజెన్సీవాసుల ఆశలపై నీళ్లు.. ఇప్పటికైనా డెవలప్ చేయాలని విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు బస్ డిపో పేరుకే అన్నట్లు మారింది. డిపోను ప్రారంభించి ఏడు నెలలైనా ఇప్పటికీ సౌకర్యాలు కల్పించడం లేదు. కొత్త బస్సులు ఒక్కటి కూడా ఇవ్వకపోవడంతో కొత్త రూట్లకు బస్సుల్లేక ఇబ్బంది అవుతోంది. ఇతర డిపోల నుంచి ఇచ్చిన పాత బస్సులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లెందు బస్ డిపో పేరుతో హడావుడి చేసిందని ఏజెన్సీవాసులు ఆరోపిస్తున్నారు.
దశాబ్దాల కల..
దశాబ్దాల కాలంగా ఇల్లెందు ఏజెన్సీ వాసులు బస్ డిపో ఏర్పాటు ఎప్పుడెప్పుడా అని కలలు కన్నారు. అప్పటి ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, ఊకే అబ్బయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య బస్ డిపో ఏర్పాటు కోసం ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టులో అప్పటి ట్రాన్స్ పోర్టు మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఇల్లెందులో ఏర్పాటు చేసిన బస్ డిపోను ప్రారంభించారు. దాదాపు రూ. 3.75కోట్లతో బస్ డిపోను ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. బస్ డిపో ఏర్పాటుతో ఇల్లెందు ఏజెన్సీకి మహర్ధశ పట్టనుందని అప్పటి మంత్రి, ఎమ్మెల్యే చెప్పారు.
ఎన్నికల్లో లబ్ధి కోసమే..
ఇల్లెందు బస్సు డిపోను ఎలాంటి సౌకర్యాలు లేకుండానే ప్రారంభించారు. తర్వాత పట్టించుకోలేదు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే గత బీఆర్ఎస్ సర్కార్ హడావుడిగా బస్ డిపోను ప్రారంభించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు డిపోల నుంచి ఇచ్చిన పాత 26 బస్సులే ఇల్లెందు డిపోకు దిక్కుగా మారాయి. వాటిలో నిత్యం నాలుగు బస్సులు రిపేర్లతోనే ఉంటున్నాయి. కొత్త బస్సులు వస్తాయని అప్పటి మంత్రి పువ్వాడ, అప్పటి ఎమ్మెల్యే హరిప్రియ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి.
బస్ డిపో ఏర్పాటు చేసి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క కొత్త బస్సును కేటాయించలేదు. దీంతో కొత్త రూట్లలో బస్సులు తిరగడం లేదు. ఇల్లెందు బస్టాండ్ నుంచి టేకులపల్లి మీదుగా బోడు వరకు, ఇల్లెందు నుంచి ఆళ్లపల్లి, మార్కోడ్ వరకు, ఇల్లెందు నుంచి పాఖాల కొత్తగూడెం మీదుగా నర్సింపేట, వరంగల్‌కు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నా కొత్త బస్సులు లేక నడపలేని పరిస్థితి నెలకొంది.
ఆదాయం ఫుల్.. సౌకర్యాలు నిల్..
డిపోలోని సిబ్బందితో పాటు బస్టాండ్‌లోని ప్రయాణికులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. డ్రైవర్లు, మెకానిక్‌లు సరిపోనూ లేరు. ఇల్లెందు డిపో నుంచి ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్, బయ్యారం, గుండాలకు బస్సులు నడుస్తున్నాయి. ఇల్లెందు ఏజెన్సీ నుంచి ఎక్కువగా కరీంనగర్, వేములవాడ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా రూట్లకు ఇల్లెందు డిపో నుంచి ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఇతర డిపోల నుంచి వచ్చే బస్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఇల్లెందు బస్టాండ్ నుంచి రోజూ దాదాపు 10వేల నుంచి 15వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ దాదాపు రూ. 3.50 లక్షల నుంచి రూ. 4లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఆదాయంలో కొత్తగూడెం బస్ డిపోతో పోటీ పడుతోంది. కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఇల్లెందు డిపోతోపాటు బస్టాండ్‌ను డెవలప్ చేయాలని పలువురు కోరుతున్నారు.
అన్నింటికీ కొత్తగూడెం డిపోనే..
ఇల్లెందు డిపోకు సంబంధించిన ఏ చిన్న పని అయినా కొత్తగూడెం డిపోలోనే జరుగుతోంది. ఇల్లెందు డిపో ఏర్పాటు చేసిన నాటి బీఆర్ఎస్ సర్కార్ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేయలేదు. పెట్రోల్‌తోపాటు వెల్డింగ్ వర్క్స్, ఇతర ఆఫీస్ వర్క్ అంతా కావాలంటే కొత్తగూడెం బస్ డిపోకు వెళ్లాల్సిందే.