
ఇల్లెందు, వెలుగు: ఇంట్లో చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను తెలిపారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈనెల 12న తెల్లవారుజామున కొత్త బస్టాండ్ సమీపంలోని సింగరేణి కార్మికుడు పెద్దపల్లి కుమారస్వామి బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం ఉదయం బుగ్గ వాగు బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద ఉన్న బ్యాగులో 19.9 తులాల బంగారం, 20 తులాల వెండి దొరికింది. అవి కుమారస్వామి ఇంట్లో దొంగలించినట్లు తేలింది. నిందితుడు హైదరాబాద్లోని ఉప్పుగూడకు చెందిన కోరి రాహుల్(23)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే 6 కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలు శిక్ష సైతం అనుభవించాడు. కాగా 24 గంటల్లో కేసును ఛేదించిన ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు నాగుల్ మీరా పఠాన్, సూర్యం, సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించి రివార్డును అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.