జోరుగా ఎర్రరాళ్ల దందా అటవీ, ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు

జోరుగా ఎర్రరాళ్ల దందా అటవీ, ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు

సంగారెడ్డి, వెలుగు: జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎర్ర నేలల నుంచి రాళ్లను తవ్వి కొందరు అక్రమార్కులు మైనింగ్ బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా చట్ట విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడి ఎర్రరాయికి తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రల్లో మంచి డిమాండ్ ఉంది.

 దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ప్రభుత్వ, పట్టా, అటవీ, నీమ్జ్ భూముల్లో పర్మిషన్లు తీసుకోకుండానే తవ్వకాలు చేస్తూ అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. వివిధ నిర్మాణాలకు ఈ ఎర్రరాయి అణువుగా ఉండడం  వల్ల క్వారీలను ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా పక్క రాష్ట్రాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

నిర్మాణాలకు అనువైన రాయి

జహీరాబాద్ ప్రాంతంలో లభించే ఎర్ర రాయి వివిధ నిర్మాణాలకు అనువైన రాయిగా పేరుగాంచింది. ఈ సెగ్మెంట్​లో ఎక్కడ చూసినా ఎర్రరాయితో కట్టిన నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తాయి. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో వందల ఎకరాల్లో ఈ ఎర్రరాళ్ల క్వారీలు కొనసాగుతున్నాయి. ఏ ఒక్క దానికి పర్మిషన్  లేదు. అయినా రేయింబవళ్లు క్వారీలు నడుస్తూనే ఉంటాయి. దాదాపు మూడంతస్తుల బిల్డింగ్ ఎత్తులో, పెద్దపెద్ద గనులను తలపించేలా తవ్వేస్తున్నారు. వర్షాకాలంలో అవి పూర్తిగా నిండి అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నీమ్జ్ భూముల్లో..

న్యాల్కల్ మండలం నీమ్జ్ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. గ్రామాల శివారులో ఉన్న భూములను ఎంచుకొని గుట్టుచప్పుడు  కాకుండా తవ్వేస్తున్నారు. ఒక్క న్యాల్కల్ మండలంలోనే దాదాపు 20 ఎకరాల నీమ్జ్ భూములను తవ్వేసినట్టు సమాచారం. గనులను తలపించే క్వారీల్లో భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఆధునిక యంత్రాలను వినియోగించి మైనింగ్ బిజినెస్ చేస్తున్నారు. 

ఒక్కో గనిలో పదుల సంఖ్యలో యంత్రాలు పనిచేస్తున్నాయి. కొన్ని యంత్రాలకు కరెంట్ సరఫరా అవసరం ఉండడంతో ఇల్లీగల్ గా విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. కరెంట్ సరఫరా లేని చోట్ల జనరేటర్లను వినియోగించి పని కానిచ్చేస్తున్నారు. ఒక్కో గని ద్వారా నెలకు సుమారు రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. స్థానిక పొలిటికల్ లీడర్ల సాయంతో మైనింగ్ మాఫియా ఈ దందా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లల్లో జరుగుతున్న ఈ బిజినెస్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 

చర్యలు తీసుకుంటాం    

జహీరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రరాళ్ల తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగించడం చట్టవిరుద్ధం. నేను ఇటీవలే ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నా. రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకుని  పరిశీలిస్తా. ఒకటి రెండు రోజుల్లో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్థలాలను పరిశీలించి ఎర్రరాళ్ల అక్రమ దందాను అడ్డుకుంటాం.  రామ్ రెడ్డి, జహీరాబాద్, ఆర్డీవో