బస్తీ దవాఖానాలకే సుస్తీ చేసింది
వరద నీళ్లు వెళ్లి పోయినా తిరిగి ప్రారంభించడం లేదు
వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్న జనం
హైదరాబాద్,వెలుగు: సిటీలోని మురికివాడల జనాలకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తామని చెప్పి ఓపెన్ చేసిన బస్తీ దవాఖానలను సర్కార్ పట్టించుకుంటలేదు. ఎప్పటికప్పుడు సౌలతులపై దృష్టి పెట్టాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో బస్తీ దవాఖానలకు వెళ్తే ట్రీట్ మెంట్ అందకపోవడంతో పేషెంట్లు దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్స్, ఏరియా, పెద్దాస్పత్రులకు పోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20కిపైగా బస్తీ దవాఖానలు వరదలో మునిగిపోయాయి. కొన్ని దవాఖానల్లో యంత్రాలు, పరికరాలు, మందులు కొట్టుకుపోయాయి. వరదనీరు పోయినా ఇప్పటికీ వాటిని తిరిగి ప్రారంభించలేదు. బార్కాస్ క్లస్టర్‌లోని హషీమాబాద్ బస్తీ దవాఖానలోకి పూర్తిగా స్లాబ్ లెవల్ దాకా వరద నీరు చేరడంతో కంప్యూటర్లు, ల్యాబ్‌లోని మెషీన్లు, మెడిసిన్ కొట్టుకుపోయాయి. 20 రోజులు దాటినా అక్కడ వైద్యసేవలు మళ్లీ కొనసాగించడం లేదు. మరో 30 బస్తీ దవాఖానల్లో వైద్య సిబ్బంది కొరతతో సరిగ్గా సేవలు అందడంలేదు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వైద్యసేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా క్లారిటీ లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పేషెంట్లు మళ్లీ ప్రైవేటు హాస్పిటల్స్‌కి పోతున్నారు.
మెడికల్ ఆఫీసర్లు ఉండట్లే..
బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్లు సరిగ్గా డ్యూటీలు చేయడం లేదు. పై చదువుల కోసం అని కొన్ని నెలల్లోనే రిజైన్ చేసి వెళ్తున్నారు. లేదంటే తాముండే ఏరియాకు దూరంగా ఉందని డ్యూటీలు మానేస్తున్నారు. ఉదయం 11 గంటలు అయినా మెడికల్ఆఫీసర్లు రావడంలేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.42వేల శాలరీ సరిపోవడం లేదంటూ చాలామంది వెళ్లిపోతున్నారు. ఎప్పడు ఏ బస్తీ దవాఖానలో పోస్టు ఖాళీ అవుతుందో ఉన్నతాధికారులకు కూడా అర్థం కావడం లేదు. మెడికల్ఆఫీసర్లు లేని చోట్ల స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్ తోనే కొనసాగిస్తున్నారు.
అందుబాటులో లేక ప్రైవేటు హాస్పిటల్స్‌కి..
బస్తీ దవాఖానల్లో సరైన ట్రీట్ మెంట్అందకపోవడంతో దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్స్‌కి, లేదంటే ఉస్మానియా లాంటి దూరంగా ఉన్న ఆస్పత్రులకు పోతున్నారు. కొన్ని బస్తీ దవాఖానల్లో బీపీ, షుగర్లాంటి మెడిసిన్ కూడా స్టాక్ లేవు. వరద ముంపు ప్రాంతాల్లో బ్రీతింగ్ ప్రాబ్లం, వాంతులు, విరేచనాలు, చర్మ వ్యాధులు తదితర హెల్త్ప్రాబ్లమ్స్వస్తున్నాయి. ఆయా ఏరియాల్లోని జనాలకు కావాల్సిన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, లేదంటే ఉస్మానియాకు వెళ్తున్నారు. బస్తీ దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు కల్పించినప్పుడే తెరవాలని, లేకుంటే పూర్తిగా బంద్పెట్టాలని బస్తీ జనాలు అంటున్నారు.
స్టాఫ్‌ను నియమించట్లే
సర్కార్ బస్తీ దవాఖానలను హడావుడిగా ఏర్పాటు చేస్తోంది. మెడికల్ స్టాఫ్‌ను నియమించడంపై మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది. గ్రేటర్లో 300 బస్తీ దవాఖానల ఏర్పాటే లక్ష్యమని మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు పలుమార్లు చెప్పారు. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో 197 ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 116, రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ జిల్లాలో 47 ఓపెన్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో మరో 20 ఓపెన్ కానున్నాయి. వీటి సంఖ్య పెంచడంపై సరైన వైద్యసేవలు అందించడంపై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు. దవాఖానలను ఏర్పాటుకు ముందుగానే ఫుల్‌స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి. అది చేయకుండానే హడావుడిగా ఓపెన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందుతాయని చెప్పి పోవడంతోనే సరిపోతుంది.
ప్రైవేటు హెల్త్ క్యాంపు వద్ద క్యూ
పీహెచ్‌సీలకు పోతే ట్రీట్మెంట్ వెంటనే అందడం లేదు. దీంతో ప్రైవేటు హెల్త్ క్యాంపు వద్దకు జనం క్యూ కడుతున్నారు. బుధవారం ఫలక్‌నుమాలోని అల్ జుబైల్ కాలనీలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కి రెండు వేల మంది వచ్చారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో ట్రీట్ మెంట్, మెడిసిన్అందుబాటులో లేక పోవడంతోనే ఇక్కడకు వచ్చినట్లు పలువురు మహిళలు తెలిపారు.
హెల్త్ కరాబ్
వరద నీటిలో ఇల్లు మునిగిపోయింది. నీళ్లు పోయి వారం అవుతున్నా ఇంకా మురుగువాసన పోవడం లేదు. దీంతో హెల్త్ కరాబ్ అయింది. వరదలు తగ్గ గానే ఇంటికొచ్చి మందులు ఇస్తామని చెప్పిన అధికారులు రావడం లేదు. హాస్పిటల్ కి వెళ్దామంటే దగ్గరలో లేదు. ‑ జబీన్, అల్ జుబైల్కాలనీ
నీళ్లు పోయినా ఓపెన్ చేయట్లేదు
బస్తీ దవాఖాన తీయడం లేదు. వారం కిందటి దాకా నీళ్లు ఉండగా బంద్ పెట్టారు. అవి పోయినా కూడా తిరిగి ఓపెన్ చేయడం లేదు. హెల్త్ క్యాంపులు పెడుతుండగా, అక్కడి వెళ్తే జనం ఎక్కువగా ఉంటున్నరు. రోజంతా ఉంటేనే ట్రీట్మెంట్ అందుతుంది.‑ జుబైర్, ఫలక్ నుమా