ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌పై 20 నెలల నిషేధం..కోహ్లీ ఫ్యాన్స్ ఖుషి

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌పై 20 నెలల నిషేధం..కోహ్లీ ఫ్యాన్స్ ఖుషి

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ పేస్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌ కు ఊహించని షాక్ తగిలింది. షార్జా వారియర్స్‌తో ప్లేయర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఈ ఆఫ్ఘాన్ ఫాస్ట్ బౌలర్ పై ILT20.. 20 నెలల నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన సీజన్‌లో నవీన్ షార్జా వారియర్స్‌ తరపున ఆడాడు. 2023 జనవరి-ఫిబ్రవరిలో ILT20 సీజన్ 1 జరిగింది. ఈ లీగ్ లో నవీన్ 9 మ్యాచ్‌ల్లో 24.36 సగటుతో 11 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

వస్తున్న కథనాల ప్రకారం ప్రకారం నవీన్-ఉల్-హక్‌ రానున్న రెండు సీజన్ ల పాటు ILT20 లీగ్ ఆడే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే ఇతర అంతర్జాతీయ లీగ్ లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ తరపున టీ20 మ్యాచ్ లు యధావిధిగా ఆడుకోవచ్చు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ తర్వాత నవీన్ అంతర్జాతీయ వన్డే కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనపై ఉన్న పని భారాన్ని తగ్గించుకొని టీ20ల మీద దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
 
ఐపీఎల్ లో ఈ యువ బౌలర్ లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్నాడు. ఈ ఏడాది(2023) ఐపీఎల్ లో కోహ్లీతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ను ఒక ఆట ఆడుకున్నారు. ఎక్కడ మ్యాచ్ ఆడినా కోహ్లీ జపం చేసి ఈ పేసర్ ను ఏడిపించారు. వరల్డ్ కప్ లో నవీన్, కోహ్లీ మధ్య గొడవకు ఎండ్ కార్డు పడడంతో నవీన్ ను విమర్శించడం ఆపేసారు. అయితే తాజాగా 20 నెలలు బ్యాన్ పడడంతో నవీన్ ప్రవర్తనను తప్పు పడుతూ కోహ్లీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.