రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ బంద్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ బంద్
  • జూనియర్ డాక్టర్ హత్యను ఖండిస్తూ దీక్ష
  •  24 గంటల పాటు విధులు బాయ్​కాట్
  •  ఐఎంఏ పిలుపు మేరకు డాక్టర్లు, సిబ్బంది నిరసన

హైదరాబాద్, వెలుగు: కోల్​కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలను బాయ్​కాట్ చేస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్​లో పని చేస్తున్న డాక్టర్లు శుక్రవారం ప్రకటించారు.

ఓపీ, నాన్ ఎమర్జెన్సీ సేవలు అన్నీ బంద్ పెడ్తున్నామని తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అపోలో, కిమ్స్, యశోద తదితర కార్పొరేట్ హాస్పిటళ్ల డాక్టర్లు కూడా నిరసనకు మద్దతు ప్రకటించారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

కోల్​కతా జూనియర్ డాక్టర్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేపడ్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్లు, సిబ్బందిపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

క్లినికల్‌‌ ఎస్టాబ్లిష్మెంట్‌‌ యాక్ట్‌‌లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రత, సంరక్షణకు సంబంధించిన అంశాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిందని పేర్కొన్నారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా పని ప్రదేశాల్లో మహిళా డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలకు కట్టుబడి ఉన్నామన్నారు. శనివారం చేపట్టే నిరసన నేపథ్యంలో సర్కార్ హాస్పిటల్స్​లో రోగులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కోల్​కతా ఘటన దారుణం

కోల్​కతాలోని ఆర్జీ కార్ మెడిల్ కాలేజ్, హాస్పిటల్​లో జూనియర్ డాక్టర్​పై జరిగిన రేప్, మర్డర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ మెడికల్ అసోసియేషన్ యాంటీ క్వరీ చైర్మన్ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి అన్నారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి నిరసన దీక్ష చేపడ్తున్నట్లు తెలిపారు.

ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నామని చెప్పారు. జూనియర్ డాక్టర్​ను చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారన్నారు. ఇదొక అమానుష ఘటన అని, వైద్య ప్రపంచాన్ని మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.