పాకిస్తాన్ జట్టులో విబేధాలు కొత్తేమి కాదు. మాజీ క్రికెటర్లు వారసత్వాన్ని ఇప్పటితరం క్రికెటర్లు కొనసాగిస్తున్నారంతే. వారిలో వారు తగువులాడటం ఆ జట్టు ఆటగాళ్లకు ఒక ఆనవాయితీ. షాహిద్ ఆఫ్రిది, షోయాబ్ అక్తర్, సల్మాన్ భట్, డానిష్ కనేరియా, మహమ్మద్ ఆసిఫ్ జట్టులో ఉన్న రోజుల్లో ఈ వేడి మరింత ఎక్కువ వుండేది. మైదానంలో అయినా.. డ్రెస్సింగ్ రూమ్ లో అయినా ఎవరికి వారే అన్నట్లు ఉండేవారు. బౌలింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్ పట్టకపోయినా.. రనౌట్ మిస్ చేసినా సదరు ఆటగాడికి ఆరోజు నిద్ర ఉండదు. తాజాగా పాక్ జట్టులో మరోసారి అలాంటి గొడవలు బయటపడ్డాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌తో తన సత్సంబంధాల గురించి ఆల్ రౌండర్ ఇమాద్ వసీం పెదవి విప్పాడు. బాబర్‌తో ఎందుకు సన్నిహితంగా లేరన్న ప్రశ్నకు స్పందించిన ఈ ఆల్ రౌండర్.. బాబర్‌కు తనకు మధ్య పరిస్థితులు బాగోలేవని అంగీకరించాడు. అయితే అది శత్రుత్వం కాదని తెలిపాడు.
"ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టంగా ఉంది.. ఆటగాళ్ల మధ్య విబేధాలు తలెత్తడం సాధారణం. కానీ శత్రువులమనే వాస్తవంలో నిజం లేదు.." అని ఓ ఇంటర్వ్యూలో ఇమాద్ వసీం వెల్లడించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో కరాచీ కింగ్స్‌కు ఆడుతున్నప్పుడు వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తరువాత కొన్నాళ్లకే వసీం జట్టులో స్థానం కోల్పోయాడు.
పాకిస్తాన్ జట్టు తరుపున 2015లో అరంగేట్రం చేసిన ఇమాద్.. చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో కనిపించాడు.
ఆస్ట్రేలియాతో ఢీ:
ఇప్పటివరకూ పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడగా.. రెండింట విజయం సాధించింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.