ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేద్కర్ని కాదని భారతీయ చరిత్రను ఊహించలేం. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ ఘనతని, కీర్తిని గుర్తించి వారికి తగిన గౌరవం గుర్తింపు ఉండాలని అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని దిశా నిర్దేశం చేసింది. అంతటి మహనీయుడు అంబేద్కర్ పై రెండు రోజుల క్రితం భారత పార్లమెంటులోని రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన తప్పుడు వ్యాఖ్యలు పీడిత ప్రజలని, అంబేద్కర్ అభిమానులనేకాకుండా, భారతీయులందరినీ అగౌరవపరిచేలా, భారత ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు తగ్గించుకునేలా ఉన్నాయి. ఇంతకీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమన్నాడు అంటే .. నేడు ప్రతి ఒక్కరూ దేశంలో అంబేద్కర్ అనే నామాన్ని పలకడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని అందుకు బదులుగా దేవుడిని తలుసుకుంటే ఏడు జన్మలకు సరిపడ స్వర్గం లభిస్తుందని చెప్పాడు. కానీ, వాస్తవంగా మాట్లాడుకుంటే స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియదు. కానీ, భారతీయ ప్రజలు సర్వ సుఖాలు అనుభవించేలా, ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదిగేలా, భారతదేశం ప్రపంచానికె దిక్సూచిగా ఉండేలాగా ‘భారత రాజ్యాంగం’ అనే గ్రంథంతో అంబేద్కర్ దేశ చరిత్రను సంపూర్ణంగా మార్చేశాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు అతనివి మాత్రమే కాదు, బీజేపీ నాయకుల, ఆర్ఎస్ఎస్ వ్యక్తుల మనస్తత్వం అంబేద్కర్ పట్ల, అణగారిన వర్గాల పట్ల ఎలా ఉంటుందో తెలుపుతు
న్నాయి. అణగారిన వర్గాల పట్ల, అంబేద్కర్ పట్ల, భారత రాజ్యాంగం పట్ల అమిత్ షాకి, ఆర్ఎస్ఎస్ అనుచరులకి ఉండే విద్వేషం, అసహనం కూడా అమిత్ షా రూపంలో రాజ్యసభ వేదికగా రుజువు అయింది. అమిత్ షా చెపుతున్నట్టు అంబేద్కర్ నామానికి బదులుగా దేవుళ్ళని స్మరిస్తే నిజంగా స్వర్గ ప్రాప్తి లభిస్తుందో లేదో తెలియదు కానీ, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మూలంగానే ఏ దేవుడు తెంపని సంకెళ్లని, అణగారిన వర్గాలకు అగ్రవర్ణాలు వేసిన మానసిక సంకెళ్లు తెగిపోయాయి. పీడిత ప్రజలను విముక్తులను చేశాడు అంబేద్కర్. దేవుళ్ళ గుడులు ఇరకాటంలో ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉన్నత న్యాయస్థానల ద్వారా చర్చించి ఎక్కడ దేవాలయాలు నిర్మించుకోవాలో కూడా భారత రాజ్యాంగ రూపంలో అంబేద్కర్ నిర్దేశించాడు.
ఆశయాలేవి?
ఈ దేశంలో ప్రతి పౌరుడు సౌకర్యవంతమైన విద్యను, వైద్యని అనుభవిస్తూ ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ, సౌకర్యవంతమైన గృహాల్లో ఉంటూ, ప్రతి ఒక్కరు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం కోసం ప్రతి కుటుంబనికి సరిపడా వ్యవసాయ భూమి ఉండాలని ఆశించాడు. అందుకే అంబేద్కర్ భూమిని జాతీయం చేసి ప్రతి ఒక్కరికి దేశ సంపదలో వాటా ఇవ్వాలన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమా అని ఆయా ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాల వ్యక్తులు కూడా నాయకులుగా తయారవుతున్నారు. గత పదేండ్లుగా మోదీ ప్రధానిగా అధికారంలో ఉండగా ఎందుకు గ్రామస్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులని కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ప్రపంచంలోని అనేక సంస్థలు చెప్పే గణంకాలు పరిశీలిస్తే నేటికి కూడా మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం ఎంతో వెనుకబడి ఉన్నది. దీనికి కారకులు ఎవరు? 140 కోట్ల మంది భారతీయుల గుండెచప్పుడు ఒక్క అంబేద్కర్ మాత్రమే. అలాంటి మహనీయుడిపై పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ని అవమానించడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తిని తగ్గించుకోవడంతో సమానం. మానవ మనుగడ ఉన్నంతవరకు భారతదేశ చరిత్ర నుంచిఏ రాజకీయ పార్టీ నాయకుడూ తమ స్వార్థం కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ అనే పేరును తీసివేయలేరు. అంబేద్కర్ని దూషిస్తూ ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ రాజకీయాన్ని కొనసాగించలేరు. దేశంలోని అన్ని పార్టీలకు దేశ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే భారత రాజ్యాంగ గ్రంథంలోని అంశాలని తుచ తప్పకుండా అమలుపరిస్తే దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా దుఃఖంతో ఉండడు.
- పుల్లెంల గణేష్,
ధర్మ సమాజ్ పార్టీ