
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచిన అల్జీరియాకు చెందిన వివాదాస్పద బాక్సర్ ఇమానె ఖెలిఫ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పుట్టుకతో అమ్మాయి కాదు అబ్బాయి అంటూ ఓ మెడికల్ రిపోర్టు లీకవడం చర్చనీయాంశమైంది. ఖెలిఫ్ లింగ గుర్తింపునకు సంబంధించి రిపోర్టును లీక్ చేసిన ఓ ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఖెలిఫ్ శరీరంలో అంతర్గంతగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో పారిస్‌లోని క్రెమ్లిన్–బిసెట్రీ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు ఈ రిపోర్టును రూపొందించారని తెలిపారు. అయితే, ఈ మెడికల్ రిపోర్టుపై వరల్డ్ బాక్సింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒలింపిక్స్‌లో అమ్మాయిల పోటీలో అబ్బాయి ఆడిందంటూ ఖెలిఫ్‌పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. తన గోల్డ్ మెడల్‌ను వాపస్ తీసుకోవాలని ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు.