ఈసారి ఫుల్లు వానలు.. సాధారణం కన్నా ఎక్కువ పడతాయన్న ఐఎండీ

ఈసారి ఫుల్లు వానలు..  సాధారణం కన్నా ఎక్కువ పడతాయన్న ఐఎండీ
  • 105 శాతం కన్నాఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడి
  • రాష్ట్రంలో పొద్దునంతా ఎండ.. సాయంత్రం వాన
  • పలు జిల్లాల్లో గాలిదుమారంతో వర్షాలు
  • రెండు రోజులు ఇదే పరిస్థితి..19 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంతో పాటు దేశంలో ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి సీజన్​లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీర్ఘకాలిక సగటు ఆధారంగా 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దానికి 5 శాతం అటూఇటుగా రెయిన్​ఫాల్ రికార్డ్ అవుతుందని వెల్లడించింది.

 ప్రత్యేకించి తెలంగాణలో సగటు కన్నా ఎక్కువగా 870 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలతో వర్షపాతం ఫస్ట్ ఫేజ్ అంచనాలను మంగళవారం ఐఎండీ విడుదల చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ఎల్​నినో న్యూట్రల్​గా ఉందని చెప్పింది. అయితే, ప్రస్తుతం అక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లానినా (వర్షాలు ఎక్కువ పడేందుకు ఆస్కారం) పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. 

మాన్సూన్ మిషన్​ క్లైమేట్ ఫోర్​కాస్ట్ సిస్టమ్, ఇతర వాతావరణ నమూనాల ప్రకారం వర్షాకాలం మొత్తం ఎల్​నినో న్యూట్రల్ పరిస్థితులే ఉండొచ్చని పేర్కొంది. ఇటు హిందూ మహాసముద్రంలోనూ ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) కూడా వర్షాకాలం మొత్తం న్యూట్రల్​గానే ఉండొచ్చని వివరించింది. మే చివరి వారంలో వర్షపాతంపై అప్​డేటెడ్ అంచనాలను వెల్లడిస్తామని పేర్కొంది.  

పొద్దున ఎండ.. సాయంత్రం వాన 

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పొద్దునంతా ఎండ దంచికొడుతుండగా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతున్నది. ఉన్నట్టుండి గాలిదుమారం రేగడంతో పాటు మబ్బులు కమ్మేస్తున్నాయి. కాసేపట్లోనే వర్ష తీవ్రత పెరిగిపోతున్నది. మంగళవారం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. 

ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, నాగర్​కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నల్గొండ జిల్లా చండూరులో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్​నగర్ జిల్లా కొల్లూరులో 1.8 సెంటీమీటర్ల వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలోనూ మోస్తరు వర్షం పడింది. బండ్లగూడలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, హయత్​నగర్, సరూర్​నగర్, అమీర్​పేట, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, సైదాబాద్, ఆసిఫ్​నగర్, షేక్​పేట, రాజేంద్రనగర్, నాంపల్లి, హిమాయత్​నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. 

రెండ్రోజులు ఇదే పరిస్థితి  

రాష్ట్రంలో రెండు రోజుల పాటు పొద్దున ఎండ, సాయంత్రం వర్షాలు పడే  అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం విదర్భ, మరఠ్వాడా, కర్నాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్​జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక ఉష్ణోగ్రతలు మూడు రోజుల పాటు సాధారణ స్థాయిలోనే ఉంటాయని, 19వ తేదీ నుంచి 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.