
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎండల నుంచి తెలంగాణ ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాత్రి, రేపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా.. తెలంగాణలో రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. రాత్రి వేళలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిన్న (గురువారం) అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి.
రెడ్ అలర్ట్ ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ సిటీలోనూ ఎండ పెరుగుతున్నది. బోయిన్పల్లిలో 42.1, బేగంబజార్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 26 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, వనపర్తిలో 25 డిగ్రీల మేర రికార్డయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 21 డిగ్రీలకన్నా ఎక్కువగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్అలర్ట్జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ను ఇష్యూ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకుగానూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్అలర్ట్.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ఇచ్చింది. అయితే, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. శని, ఆదివారాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.