- 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్
- 43 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటన
- 17 జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండు రోజుల పాటు వడగాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా వీస్తాయని వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం పొగమంచు, మబ్బుపట్టి ఉన్నా.. మధ్యాహ్నానికి ఎండ కొట్టే అవకాశం ఉందని చెప్పింది. అత్యధికంగా శుక్రవారం ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోని నాంపల్లిలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. 17 జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 42.8, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42.7, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో 42.6, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 42.5, నాగర్‌కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో 42.4, నిర్మల్ జిల్లాలో 42.3, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో 42.2 డిగ్రీలు రికార్డయింది. రాజన్నసిరిసిల్లలో 42.1 డిగ్రీలు, మంచిర్యాల, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో 42, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 41.9, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 41.8, వికారాబాద్‌లో 41.7, భద్రాద్రి కొత్తగూడెంలో 41.5, నారాయణపేటలో 41, జయశంకర్ భూపాలపల్లిలో 40.9, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 40.1, జనగామ, హన్మకొండ జిల్లాల్లో 39.6, వరంగల్ 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్‌లోనూ మంట
హైదరాబాద్ సిటీలోనూ ఎండ దంచి కొడ్తున్నది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిల్లోని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో అత్యధికంగా 42.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని కూకట్‌పల్లిలో 42.3, హైదరాబాద్ పరిధిలోని మెట్టుగూడలో 41.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఐదు రోజుల పాటు సిటీలో ఇదే పరిస్థితి ఉండే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.