హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ గా ఉండాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు. హైడ్రా కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ సీఈ, ఎస్ ఈలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏపీలో దంచికొడుతున్న వానలు
బంగాళాఖాతంలో మంగళవారం బలపడిన తీవ్ర అల్పపీడనం.. బుధవారం నాటికి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఏపీలోని నెల్లూరు వద్ద కేంద్రీకృతమైన ఈ వాయుగుండం.. గురువారం ఉదయం పుదుచ్చేరి, నెల్లూరు మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించట్లేదు. వరదల ప్రభావం ఉండడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు. రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపైకి వరద నీరు చేరడంతో విమానాలను ల్యాండింగ్‌కు అనుమతించడం లేదు.