
- గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
- మిగతా జిల్లాల్లో 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో (ఐఎండీ)ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఐదు జిల్లాల్లో గాలిదుమారం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులువీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది.
ఐదు జిల్లాల్లో 45 డ్రిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో శనివారం కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 45.4, జగిత్యాల జిల్లా అల్లీపూర్, నిజామాబాద్ జిల్లా మెండోరాల్లో 45.3, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.8, కామారెడ్డిలో 44.6, కరీంనగర్లో 44.1 డిగ్రీల చొప్పున టెంపరచర్ నమోదైంది. నాలుగు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా నమోదుకాగా.. మిగతా జిల్లాల్లో 41.2 నుంచి 42.8 మధ్య నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.