రెడ్ అలర్ట్: హైదరాబాద్ లో అతిభారీ వర్షం పడే ఛాన్స్.. ఇళ్లలోనే ఉండండి.. బయటికి రావద్దు..

నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు ఏపీ, ఇటు తెలంగాణాలో చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.

ఈ క్రమంలో అతిభారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు.

 ప్రత్యేక కంట్రోల్ రూమ్ కోసం టోల్ ఫ్రీ నంబర్  040 - 2345 4088 కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వర్షాలు, వరదలపరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటి కప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయసహకారాలు, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తామని తెలిపారు.