మంట పుడుతున్నది.. ఉడకపోస్తున్నది: మార్చి నుంచే మొదలైన వేడి

మంట పుడుతున్నది.. ఉడకపోస్తున్నది: మార్చి నుంచే మొదలైన వేడి
  • టెంపరేచర్లు 38 డిగ్రీలే.. వేడి మాత్రం 41 డిగ్రీల రేంజ్​లో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి ఆరంభంలోనే ఎండమంట పుడుతున్నది. వేడితో జనం అల్లాడుతున్నారు. టెంపరేచర్లు సాధారణం కన్నా  కొంచెం ఎక్కువే నమోదవుతున్నా మంట మాత్రం తీవ్రంగా ఉంటున్నది. నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు  38 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. అయితే ఎండ వేడి మాత్రం 41 డిగ్రీల రేంజ్​లో ఉంటున్నది. ముఖ్యంగా అర్బన్​ ఏరియాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటున్నది. 

నగరాల్లో మొత్తం కాంక్రీట్​ నిర్మాణాలు పెరగడం, రోడ్ల విస్తరణ, రియల్​ ఎస్టేట్​ యాక్టివిటీ, వాహనాల పొల్యూషన్​ తదితర కారణాలతో ఎండ వేడి రిఫ్లెక్ట్​ అవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఇటు జిల్లాల్లో కూడా ఉక్కపోత పెరిగింది. బయట అడుగుపెడితే చెమట పడుతున్నది. సోమవారం రాష్ట్రంలోని  28 జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

అత్యధికంగా జగిత్యాల జిల్లా కోల్వాయిలో 38.3 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్​నగర్, మంచిర్యాల, నాగర్​కర్నూల్, నల్గొండ, నిర్మల్,  పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.