
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు..40 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు
- మధ్యాహ్నం మంటలు..రాత్రి చలిగాలులు
హైదరాబాద్, వెలుగు: ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఇచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి పూట ఎండ మంట.. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. కాగా, ఈ ఏడాది ఎల్‌నినో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది.
డిసెంబర్లో లానినా పరిస్థితులున్నా.. ప్రస్తుతం అది బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్లు కొంచెం పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మార్చి నుంచి మే వరకు ఎల్‌నినో న్యూట్రల్ పరిస్థితులు 60 శాతం వరకు ఉండొచ్చని డబ్ల్యూఎంవో తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎల్‌నినో బలపడొచ్చని అభిప్రాయపడింది. అయితే, ఇప్పుడే దానిపై ఓ స్పష్టతకు రాలేమని పేర్కొంది. ప్రస్తుతానికైతే లానినా పరిస్థితులు 40 శాతం వరకున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో సాధారణ వర్షపాతమే రికార్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.
టెంపరేచర్లు పెరుగుతున్నయ్..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట టెంపరేచర్లు 40 డిగ్రీల మార్క్‌కు చేరువలో ఉన్నాయి. అదే సమయంలో రాత్రిపూట చలి ప్రభా వం కూడా కనిపిస్తున్నది. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమోల్గరలో 39.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల జిల్లా గోదూరు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 39.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇటు పలు జిల్లాల్లో రాత్రిపూట టెంపరేచర్లు తగ్గుతున్నాయి.
ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 11.8, నిజామాబాద్‌లో 12, రాజన్నసిరిసిల్లలో 12.3, సిద్దిపేటలో 12.4, ఆదిలాబాద్‌లో 12.4, నాగర్‌కర్నూల్‌లో 12.5, ములుగులో 12.5, జయశంకర్ జిల్లాలో 12.6 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.