న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న సైక్లోన్ ‘యాస్’ విషయంలో అలర్ట్గా ఉండాలని కేంద్ర సంస్థలు, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని చెప్పారు. సైక్లోన్ యాస్పై ఆదివారం ఎన్ డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఇతర కేంద్ర సంస్థలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాని రివ్యూ నిర్వహించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను ముందస్తుగా తీరానికి రప్పించాలని సూచించారు. తుఫాను ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కరెంట్, టెలిఫోన్ నెట్ వర్క్ లు ధ్వంసమైతే వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కు, వ్యాక్సినేషన్ లకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. తుఫాను పరిస్థితిపై సంబంధిత రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని ప్రధాన మంత్రి ఆఫీస్ తెలిపింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులను అడ్వాన్స్ గా రిలీజ్ చేసినట్లు పేర్కొంది.
రేపటికల్లా తీవ్ర పెనుతుపానుగా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం కల్లా సైక్లోన్ గా మారుతుందని, మంగళవారం నాటి కల్లా అది తీవ్ర పెను తుఫాను (వెరీ సివియర్ సైక్లోన్)గా మారుతుందని ఇండియా మెటీరియోలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) తెలిపింది. సైక్లోన్ యాస్ గంటకు 165 కిలోమీటర్ల వేగంతో బుధవారం సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐల్యాండ్స్ మధ్య తీరాన్ని దాటవచ్చని పేర్కొంది. ఒడిశాలోని మయూర్ భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాలపై తుఫాను ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది.