![ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్](https://static.v6velugu.com/uploads/2024/10/imd-warns-heavy-rain-alert-in-andhra-pradesh-next-four-days_g9H6xYdW7A.jpg)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ ఆదివారం(అక్టోబర్ 13) వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రధానంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అక్టోబర్ 14 నుంచి 17 వరకూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుండి 55 కి.మీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పునరావాస ఏర్పాట్లు సిద్డం చేయాలని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సెలవుల్లో వుంటే వెంటనే విధుల్లో చేరి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుండాలని ఆదేశాలు అందాయి. అధికారులు, సచివాలయ సిబ్బంది స్థానికంగా 24 గంటలు అందుబాటులో వుండాలి ఆదేశించారు.