న్యూయార్క్: మన దేశ జీడీపీ వృద్ధి 2024-–25లో 7.2 శాతంగా అంచనా వేశామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్ర తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7 శాతం, ఆ తర్వాత వృద్ధి 8 శాతం ట్రెండ్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సోమవారం ఇక్కడ నిర్వహించిన న్యూయార్క్ ఫెడ్ సెంట్రల్ బ్యాంకింగ్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. మార్కెట్ మారకపు రేట్ల పరంగా ఇప్పటికే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్‌బీఐ సీనియర్ అధికారి తెలిపారు. ‘కొనుగోలు శక్తి సమానత్వం’ పరంగా దేశం ఇప్పటికే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపారు.