- 9, 11వ రోజున ఎన్టీఆర్ మార్గ్‌లో అనుమతిచ్చే చాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్సాగర్తీరంలోని నెక్లెస్రోడ్లోనే ఏడో రోజైన శుక్రవారం గణేశ్ నిమజ్జనాలు కొనసాగాయి. మూడు, ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో గణేశ్ విగ్రహాలు ఎక్కువగా నిమజ్జనానికి తరలివెళ్తాయి. ఇప్పటికే మూడు, ఐదు రోజుల్లో వందల సంఖ్యలో గణనాథుల నిమజ్జనాలు పూర్తయ్యాయి. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు పోలీసులు విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించలేదు. జీహెచ్ఎంసీ అధికారులు నెక్లెస్రోడ్లోనే 12 క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనం చేయిస్తున్నారు. ఏడో రోజయిన శుక్రవారం ఎన్టీఆర్‌మార్గ్‌లో క్రేన్లు పెట్టి నిమజ్జనానికి అనుమతిస్తారని అంతా భావించారు. కానీ, నెక్లెస్రోడ్డులోనే నిమజ్జన తంతును కొనసాగించారు. శనివారం ఎన్టీఆర్‌మార్గ్‌లో క్రేన్లను బిగించే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.
సాగర్ తీరంలో కంట్రోల్ రూమ్స్
మహా నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని టీజీ పీడీసీఎల్చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్మార్గ్తో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిమజ్జనం సందర్భంగా అదనపు లోడ్ సమస్య వచ్చినా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లలో స్తంభాలు, వైర్ల సమస్య రాకుండా చేశామన్నారు. హుస్సేన్‌సాగర్‌సహా సిటీ మొత్తం కరెంట్సరఫరా తీరును పర్యవేక్షించడానికి డైరెక్టర్లను, చీఫ్ ఇంజినీర్లను ఇన్చార్జులుగా నియమించామన్నారు. ఏదైనా సమస్య వస్తే కంట్రోల్ రూమ్ నంబర్100 లేదా 1912 కు కాల్ చేయాలని సూచించారు.
సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తరలించాలి
గణేశ్నిమజ్జనాల నేపథ్యంలో మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తరలించాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బోర్డు హెడ్డాఫీసులో సమీక్ష నిర్వహించారు. సిల్ట్ కార్టింగ్ వాహనాల పనితీరుపై ఆరా తీశారు. ఎయిర్ టెక్మెషీన్లు అందుబాటులో ఉంచాలని, వాటి పనితీరు పర్యవేక్షించడానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.ఈడీ మయాంక్ మిట్టల్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్–2 స్వామి, ఆపరేషన్స్ డైరెక్టర్–1 విజయరావు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.