కారులో వలసల టెన్షన్​  కమలంలో టికెట్ల పరేషాన్

  • అభ్యర్థులను ఖరారు చేయని గులాబీ నేతలు
  • బలమైన నేతల కోసం అన్వేషణ
  • వలస నేతలకు టికెట్లపై బీజేపీ సీనియర్ల ఫైర్​ 

నల్గొండ,వెలుగు: ఉమ్మడి జిల్లా బీఆర్​ఎస్, బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం తీరుపై సీనియర్లు మండిపడుతుండగా.. ఎంపీ క్యాండిడేట్లను డిసైడ్​ చేయడానికి బీఆర్​ఎస్ కిందామీదా పడుతోంది. లీడర్ల మధ్య విభేదాలు, ఎవరెప్పుడు కాంగ్రెస్​లోకి జంప్​చేస్తారో అన్న భయాల వల్ల అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.  ఇప్పటికే మండలి చైర్మన్​ సుఖేందర్​ రెడ్డి, ఆయన కుమారుడు అమిత్​రెడ్డి కాంగ్రెస్​నేతలతో టచ్​లోకి వెళ్లారు.  భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖరరెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు.

హుజూర్​నగర్​ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. వెంటనే బీజేపీ నాయకత్వం ఆయనను అభ్యర్థిగా ప్రకటించేసింది. పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియని ఆయోమయంలో బీఆర్ఎస్​హైకమాండ్​ ఉంది. ఎంపీ క్యాండిడేట్లను ప్రకటిస్తే మరికొందరు సీనియర్లు గంపగుత్తగా కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. సైదిరెడ్డి జంప్​ కావడంతో హుజూర్​నగర్​లోబీఆర్ఎస్ కేడర్​అంతా కాంగ్రెస్​లోకి వెళ్లిపోయింది. గుత్తా, పైళ్ల కూడా చేరితే నల్గొండ, నాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు, నకిరేకల్​ నియోజకవర్గాల్లో ప్రభావం పడనుంది. 

కాంగ్రెస్సే టార్గెట్​ 

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​ను దెబ్బ తీయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అయితే   పార్టీ కేడర్​ కాంగ్రెస్​లో చేరడం ద్వారా హైకమాండ్​కు షాక్​ఇస్తోంది. నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్​ ఇవ్వడం  దాదాపు ఖరారైంది. బీసీలకు ఇవ్వాలనుకుంటున్న భువనగిరిలో గౌడ్ అభ్యర్థిని నిలబెట్టాలా.. కురమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్​కు ఇవ్వాలా అన్నది ఇంకా తేలలేదు.

బీజేపీ బూర నర్సయ్య గౌడ్​కు ఇచ్చినందున అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​ నిలబెడితే గౌడ ఓట్లు చీలి కాంగ్రెస్​ లాభపడుతుందని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ బలమైన బీసీ క్యాండిడేట్ కోసం అన్వేషిస్తోంది. తమ విజయం కన్నా కాంగ్రెసఖ ఓటమి మీదే బీఆర్ఎస్​ హైకమాండ్​ ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తోంది.    

బీజేపీ  సీనియర్లు  గరం 

భువనగిరి, నల్గొండల నుంచి బీజేపీ టికెట్లు బీఆర్ఎస్​ వలస నేతలకే ఇవ్వడాన్ని ఆ పార్టీ జిల్లా నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లను పక్కన పెట్టి కొత్తగా చేరిన వాళ్లకు టికెట్​ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలప్పటి నుంచి పార్టీకి వసల లీడర్లతో నష్టం కలుగుతోందని వాపోతున్నారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, చల్లమల్ల కృష్ణారెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బండ్రు శోభారాణి, పాల్వాయి రజనీకుమారి తదితరులు కొద్దిరోజులకే సొంత పార్టీలోకి వెళ్లిపోయిన సంగతి గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్లు కూడా ఎన్నికల్లో ఓడిపోతే పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదని అంటున్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన సైదిరెడ్డికి ఎంపీ టికెట్​ ఇవ్వడాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మునుగోడు సీటు త్యాగం చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్, పీవీ శ్యాసుందర్​రావు, గోలి మధుసూధన్​ రెడ్డి, బండారు ప్రసాద్​ లాంటి సీనియర్లను కాదని వలసొచ్చిన వారికి టికెట్​ ఇవ్వడం సరి కాదని, ఇలాగైతే కేడర్​ సహరించే పరిస్థితి ఉండదని అంటున్నారు.